వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- June 15, 2026
-ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.. నిర్లక్ష్యంపై కఠిన చర్యల హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల ప్రభావం, ప్రాజెక్టుల భద్రత, పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్ సరఫరా, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, మేడ్చల్-మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, అగ్నిమాపక శాఖ అదనపు డీజీ విక్రమ్ సింగ్ మాన్ తదితరులు హాజరయ్యారు.
ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి
వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్వహణ తప్పనిసరిగా మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం జరగాలని, సంబంధిత ఇంజినీర్లు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు వర్షాకాలం మొత్తం స్థానికంగానే ఉండాలని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను విడిచి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల మరమ్మతుల కోసం అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు.
శాఖల మధ్య సమన్వయం పెంచాలి
ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డు, గ్రామీణ నీటి సరఫరా (RWS) శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. యూరియా పంపిణీ కోసం రైతు వేదికలను వినియోగించాలని, పంపిణీ బాధ్యతలను స్థానిక వ్యవసాయ అధికారులకు అప్పగించాలని, రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
అధికారుల నిర్లక్ష్యం పై అసంతృప్తి
జూన్ 1న వర్షాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ, జూన్ 9న కురిసిన వర్షాల సమయంలో కొంతమంది అధికారులు సమర్థవంతంగా పనిచేయలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాల సమయంలో మున్సిపల్, పోలీస్ శాఖల మధ్య సరైన సమన్వయం లేదని పేర్కొన్నారు.
ట్రాఫిక్, వాటర్‌లాగింగ్ పై ప్రత్యేక దృష్టి
వర్షాల సమయంలో నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలు, బ్లాక్స్పాట్లు, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
“వర్షాల సమయంలో ట్రాఫిక్ విభాగంలో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపై ఉండాలి. అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తాను,” అని సీఎం పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి
వర్షాల ప్రభావంతో విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఫీల్డ్‌లో అందుబాటులో లేని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
మానవ తప్పిదాలు సహించబోం
వర్షాల సమయంలో మానవ తప్పిదాల కారణంగా సమస్యలు తలెత్తితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్రాఫిక్ శాఖలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









