కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..

- June 22, 2026 , by Maagulf
కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆరుగురు విద్యార్థులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMC) ఆసుపత్రికి తరలించారు.

పురానియా ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌పై అంతస్తులో నిర్వహిస్తున్న యానిమేషన్ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్న విద్యార్థులు, ఇతరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

అగ్నిప్రమాదం సంభవించిన భవనంలో కోచింగ్ సెంటర్‌తో పాటు గేమ్ జోన్, షోరూమ్‌లు కూడా ఉన్నాయి. మంటలు వ్యాపించడంతో కొందరు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు మొదటి అంతస్తు నుంచి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం గోడను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన అగ్నిమాపక సిబ్బంది పలువురిని రక్షించారు.

ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్, అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు రాష్ట్ర డీజీపీ, అదనపు ప్రధాన కార్యదర్శితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల పర్యటనను మధ్యలోనే నిలిపివేసి లక్నోకు చేరుకున్న ఆయన, ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com