హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- July 05, 2026
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-1 టేకోవర్ (స్వాధీనం) ప్రక్రియను ముగించి, ఫేజ్-2 విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్‌కు ఆదివారం ఆయన ఒక అధికారిక లేఖ రాశారు. మెట్రో మొదటి దశ విలువను లెక్కించడంతో పాటు, రెండో దశకు సంబంధించిన ఆర్థిక నమూనాను పరిశీలించే బాధ్యతలను తక్షణమే ‘ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్’ (SBI CAPS)కు అప్పగించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
జాప్యం వల్ల పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయం
మెట్రో ఫేజ్-1 స్వాధీన ప్రక్రియ ఆలస్యం కావడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా ఈ ప్రక్రియ సాగుతుండటం వల్ల ప్రాజెక్టు రోజువారీ నిర్వహణలో సవాళ్లు, అనిశ్చితి ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. “ఈ ఆలస్యం కారణంగా ఫేజ్-2 డీపీఆర్ (DPR) ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ మందగిస్తోంది. కాలయాపన వల్ల భవిష్యత్తులో రెండో దశ నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది” అని సీఎం లేఖలో స్పష్టం చేశారు.
ఢిల్లీ సమావేశ నిర్ణయాలను గుర్తు చేసిన సీఎం
గత జూన్ 24న ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిల సమక్షంలో జరిగిన కీలక సమావేశాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెట్రో ఫేజ్-1 స్వాధీనం, అధిక వడ్డీ రుణాల రిఫైనాన్సింగ్, అలాగే ఫేజ్-2 విస్తరణకు ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను ‘ఎస్బీఐ క్యాప్స్’కు అప్పగించాలని ఆ రోజే ప్రాథమికంగా నిర్ణయించినట్లు గుర్తు చేశారు.
నోడల్ అధికారి నియామకం..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా లేఖ
ఢిల్లీ సమావేశం ముగిసి చాలా రోజులవుతున్నా, ఎస్బీఐ క్యాప్స్‌కు కేంద్రం నుంచి ఇంకా అధికారికంగా బాధ్యతలు బదిలీ కాలేదని, విధివిధానాలు కూడా ఖరారు కాలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించిందని తెలిపారు. ఢిల్లీ నిర్ణయాలను త్వరితగతిన అమలు చేసి మెట్రో ఫేజ్-2కు మార్గం సుగమం చేయాలని కోరారు.
ఇదే అంశం పై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కూడా సీఎం లేఖ రాశారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖతో మాట్లాడి ఈ ప్రక్రియ వేగవంతమయ్యేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







