NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..
- July 05, 2026
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) నోల్ (nol) చెల్లింపు వ్యవస్థను ఆధునికీకరించే ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తయ్యాయని ప్రకటించింది. ప్రస్తుతం కార్డ్ ఆధారిత టికెటింగ్ (CBT) విధానంలో ఉన్న నోల్ వ్యవస్థను, అత్యాధునిక అకౌంట్ బేస్డ్ టికెటింగ్ (ABT) డిజిటల్ చెల్లింపు విధానంగా మార్చే పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్టు 2027 తొలి త్రైమాసికం చివరి నాటికి పూర్తికానుంది.
ఆర్టీఏ డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ మట్టర్ అల్ తాయర్ మాట్లాడుతూ, ఈ అప్‌గ్రేడ్ దుబాయ్ డిజిటల్ పరివర్తనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజా రవాణా సేవలను ఒకే డిజిటల్ చెల్లింపు వేదికతో అనుసంధానించి, ప్రయాణికులకు మరింత సులభమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.
కొత్త వ్యవస్థతో ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయడం, నోల్ కార్డులను వ్యక్తిగత ఖాతాలకు అనుసంధానం చేయడం, స్మార్ట్‌ఫోన్ డిజిటల్ వాలెట్లలో నోల్ కార్డులను జోడించడం, ఆటోమేటిక్ రీచార్జ్ సదుపాయం, అలాగే డిజిటల్ లావాదేవీల వివరాలను పరిశీలించడం వంటి అనేక సౌకర్యాలను పొందగలరని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేస్తున్నట్లు ఆర్టీఏ తెలిపింది. మొదటి దశలో డిజిటల్ ఛానళ్ల ద్వారా క్యూఆర్ కోడ్ టికెటింగ్ అందుబాటులోకి రానుంది. రెండో దశలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త తరం నోల్ కార్డులు ప్రవేశపెడతారు. మూడో దశలో బ్యాంక్ కార్డులు, డిజిటల్ వాలెట్లు వంటి ఇతర చెల్లింపు విధానాలను ప్రజా రవాణా ఛార్జీల చెల్లింపుకు అనుమతిస్తారు.
కొత్త వ్యవస్థతో కుటుంబ సభ్యుల నోల్ కార్డులను ఒకే ఖాతాకు అనుసంధానం చేయడం, ప్రతి కార్డుకు విడివిడిగా రీచార్జ్ పరిమితులు నిర్ణయించడం, కార్డు పోయినప్పుడు బ్లాక్ చేయడం, మిగిలిన బ్యాలెన్స్‌ను తిరిగి పొందడం వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ప్రజా రవాణా స్టేషన్లలోని స్మార్ట్ కియోస్క్‌లు, టికెట్ యంత్రాలు కూడా ఈ కొత్త సాంకేతికతకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడతాయి. దీంతో ప్రయాణికులు క్యూఆర్ కోడ్ టికెట్లు, కొత్త తరం నోల్ కార్డులు, బ్యాంక్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
అంతేకాకుండా, కొత్త తరం నోల్ కార్డులను కేవలం ప్రజా రవాణాకే కాకుండా, యూఏఈలోని వివిధ రిటైల్ దుకాణాలు, డిజిటల్ వేదికల్లో కూడా బ్యాంక్ కార్డుల మాదిరిగా వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.
దుబాయ్ మెట్రో ప్రారంభమైన 2009 సెప్టెంబర్ 9న నోల్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఆర్టీఏ, అనంతరం విద్యార్థుల కోసం ప్రత్యేక నోల్ స్టూడెంట్ ప్యాకేజ్, పర్యాటకులు, నివాసితుల కోసం ప్రత్యేక ట్రావెల్ కార్డులు, అలాగే ఈ-స్కూటర్లు వంటి సాఫ్ట్ మొబిలిటీ సేవలకు నోల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజా రవాణా సేవలను మరింత సులభతరం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







