భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!

- July 10, 2026 , by Maagulf
భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!

రియాద్: విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సౌదీ అరేబియా కొత్త 'వీసా ప్యాకేజీ' సేవను ప్రారంభించింది. తొలి దశలో భారత్, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మెక్సికో దేశాల పౌరులు ఈ సౌకర్యాన్ని పొందేందుకు అర్హులని సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పథకం ద్వారా విమాన టికెట్, లైసెన్స్ పొందిన హోటల్ బుకింగ్, ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా అన్నీ ఒకే ప్యాకేజీగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో టూరిస్ట్ వీసా కోసం విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.

అధీకృత ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ప్యాకేజీని బుక్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపు పూర్తి చేసిన తర్వాత గరిష్ఠంగా 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా జారీ అవుతుంది. సౌదీ రాయబార కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం కూడా ఉండదు. వీసాతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇతర ప్రయాణ పత్రాలు ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు. ప్రస్తుతం రిజర్వల్ (Reserval), అల్‌మోసాఫర్ (Almosafer) అనే రెండు ట్రావెల్ ఏజెన్సీలకు మాత్రమే ఈ సేవ అందించే అనుమతి ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ ప్యాకేజీ కింద జారీ చేసే టూరిస్ట్ వీసా సింగిల్ ఎంట్రీ వీసా. ఇది మూడు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సౌదీలో కనీసం రెండు రోజులు, గరిష్ఠంగా 88 రోజుల వరకు ఉండవచ్చు. ప్రయాణ ప్యాకేజీని రద్దు చేస్తే వీసా కూడా ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. ప్యాకేజీలో తప్పనిసరిగా రిటర్న్ విమాన టికెట్, పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన కనీసం ఫోర్ స్టార్ హోటల్ బుకింగ్, ఈ-వీసా దరఖాస్తు ఉండాలి. తొలి రెండు రోజుల ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి 4,000 సౌదీ రియాల్స్ గా నిర్ణయించారు. అదనంగా ప్రతి రోజుకు 1,000 రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే, ఈ ప్యాకేజీలో ఈవెంట్ టికెట్లు, వినోద కార్యక్రమాలు వంటి అదనపు సేవలను కూడా అవసరానికి అనుగుణంగా చేర్చుకోవచ్చు. ప్యాకేజీలో మక్కా, మదీనా నగరాల్లో ఉమ్రా సేవలు ఉండవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ వీసాతో సౌదీలోకి ప్రవేశించిన తర్వాత మక్కా, మదీనా సహా దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.

విమాన సర్వీసులు లేదా హోటల్ బుకింగ్‌లు అనివార్య కారణాలతో రద్దయితే, రీఫండ్‌లు, బుకింగ్ మార్పులు సంబంధిత అధీకృత ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. రాబోయే దశల్లో మరిన్ని దేశాల పౌరులకు కూడా ఈ వీసా ప్యాకేజీ సేవను విస్తరించనున్నట్లు సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com