సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!

- July 12, 2026 , by Maagulf
సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!

రియాద్: సౌదీ అరేబియాలో నివాస, కార్మిక చట్టాలు మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క వారంలోనే మొత్తం 15,430 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అరెస్టయిన వారిలో రెసిడెన్సీ (ఇఖామా) చట్టాల ఉల్లంఘన కింద 7,913 మంది, సరిహద్దు దాటేందుకు అక్రమ ప్రయత్నాలు చేస్తూ.. 4,037 మంది, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 3,480 మంది ఉన్నారు.

అదే విధంగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన 1,542 మందిలో... 53 శాతం మంది ఇథియోపియా దేశస్థులు కాగా, 46 శాతం మంది యెమెన్ పౌరులు, మిగిలిన 1 శాతం ఇతర దేశాలకు చెందిన వారని నివేదిక పేర్కొంది. వీరికి తోడు పొరుగు దేశాల్లోకి అక్రమంగా సరిహద్దులు దాటడానికి ప్రయత్నించిన మరో 30 మందిని, అలాగే అక్రమ వలసదారులకు రవాణా, ఆశ్రయం కల్పించడంలో పాలుపంచుకున్న 27 మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఎలాంటి సహాయసహకారాలు, రవాణా సౌకర్యాలు లేదా ఆశ్రయం కల్పించినా కఠిన చర్యలు ఉంటాయని మంత్రిత్వ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నేరాలకు పాల్పడితే గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్ష, 1మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించడంతో పాటు, ఉపయోగించిన వాహనాలు, ఆస్తులను కూడా జప్తు చేస్తామని స్పష్టం చేసింది.

చట్టాలను ఉల్లంఘించేవారికి సంబంధించి ఎలాంటి సమాచారమున్నా మక్కా, రియాద్ ప్రాంతాల ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 911కు, దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు 999 లేదా 996 నంబర్లకు ఫోన్ చేసి నివేదించవచ్చని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com