అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- July 15, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని ఈస్టర్న్ ప్రావిన్స్ లో మంగళవారం ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్-అహ్సా నగరంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో ఇది 2026లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత గల నగరంగా నిలిచింది. ఈ విషయాన్ని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ధృవీకరించింది. అంతకుముందు మే 29న అల్-అహ్సాలో 49.3 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, మంగళవారం ఆ రికార్డు బద్దలైంది.
తూర్పు ప్రావిన్స్‌కు తీవ్ర ఉష్ణోగ్రతల హెచ్చరిక
49 నుంచి 50 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు దమ్మామ్, ధహ్రాన్, అల్-ఖోబర్, జుబైల్, ఖతీఫ్, రాస్ తనూరా, హఫర్ అల్-బాతిన్, అల్-ఖఫ్జీ, అల్-నైర్యా, ఖర్యత్ అల్-ఉల్యా, బుకైక్, అల్-అహ్సా తదితర ప్రాంతాలను ప్రభావితం చేస్తాయని ఎన్సీఎం హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు దుమ్ము తుఫాన్లు వీచే అవకాశం ఉండటంతో రహదారులపై, బహిరంగ ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గవచ్చని అధికారులు సూచించారు.
జూలై, ఆగస్టులోనూ అధిక ఉష్ణోగ్రతలే
జూన్‌లో విడుదల చేసిన వాతావరణ అంచనాల్లో ఎన్సీఎం.. జూలై మరియు ఆగస్టు నెలల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈస్టర్న్ ప్రావిన్స్‌లో జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.
జీవనశైలిలో మార్పులు
తీవ్ర ఎండల కారణంగా స్థానికులు తమ రోజువారీ కార్యక్రమాలను మార్చుకుంటున్నట్టు ఈస్టర్న్ ప్రావిన్స్ నివాసి రహఫ్ అల్-మదానీ తెలిపాడు. బయటకు వెళ్లాల్సి వస్తే వీలైనంత వరకు నీడలోనే ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మధ్యాహ్నం అత్యధిక వేడి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం, సన్‌స్క్రీన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే టోపీ లేదా తల కప్పుకునే వస్త్రాలు ధరించడం, యూవీ రక్షణ కలిగిన గొడుగులు, సన్‌గ్లాసెస్ ఉపయోగించడం, తరచూ నీరు తాగడం అవసరమన్నారు.
ఇండోర్ కార్యకలాపాలకే ప్రాధాన్యం
తీవ్ర ఎండల కారణంగా బహిరంగ కార్యకలాపాలు తగ్గిపోయినా, ఎయిర్ కండీషనింగ్ ఉన్న షాపింగ్ మాల్స్, కేఫేలు, ఇండోర్ ప్యాడెల్ కోర్టులు, బోర్డ్ గేమ్ కేఫేలు, సినిమా థియేటర్లు వంటి ప్రదేశాల్లో ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నారని స్థానికులు తెలిపారు. సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మాత్రమే బయట నడక వంటి కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







