ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!

- July 16, 2026 , by Maagulf
ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!

దోహా: ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ(ఫాదర్ అమీర్) స్మారకార్థం సంతాప సభ నిర్వహించారు. ఇందులో ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC), ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరం (ICBF), ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ (ISC), ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ (IBPC) సభ్యులు పాల్గొన్నారు. దోహాలోని ఐసీసీ అశోకా హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాయబారి హెచ్.ఈ. విపుల్‌తో పాటు ఆయా భారతీయ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొని మాజీ అమీర్‌కు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాయబారి విపుల్ మాట్లాడుతూ.. ఆధునిక ఖతార్ నిర్మాణానికి మాజీ అమీర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారత ప్రభుత్వం, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం, భారతీయ సమాజం తరఫున ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుత అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, అల్ థానీ రాజ కుటుంబ సభ్యులు, ఖతార్ ప్రజల దుఃఖంలో భారతీయ సమాజం భాగస్వామిగా నిలుస్తోందని తెలిపారు. ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, విద్య, సంస్కృతి, క్రీడలు, మానవ వనరుల అభివృద్ధి వంటి రంగాల్లో మాజీ అమీర్ దూరదృష్టి నాయకత్వం ఖతార్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేశంగా తీర్చిదిద్దిందని విపుల్ పేర్కొన్నారు.

భారత్‌తో మాజీ అమీర్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేస్తూ..  భారతీయ ప్రజలు, ముఖ్యంగా ఖతార్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసుల పట్ల ఆయన ఎల్లప్పుడూ ఆప్యాయత, గౌరవం చూపారని చెప్పారు. 1999, 2005, 2012 సంవత్సరాల్లో ఆయన చేసిన అధికారిక భారత పర్యటనలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేశాయని తెలిపారు. కార్యక్రమంలో ఆ పర్యటనలకు సంబంధించిన అరుదైన దృశ్యాలను ప్రదర్శించిన ఇండియన్ కల్చరల్ సెంటర్‌ను ఆయన అభినందించారు.

2020లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, 2022లో అప్పటి ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, 2024లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాజీ అమీర్ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం తనకు లభించిందని రాయబారి విపుల్ వెల్లడించారు.

ఈ సంతాప సభలో ఐసీసీ అధ్యక్షుడు ఏ.పీ. మణికంఠన్, ఐసీబీఎఫ్ అధ్యక్షుడు షానవాస్ టి. బావా, ఐఎస్సీ అధ్యక్షుడు ఈ.పీ. అబ్దుర్రహ్మాన్, ఐబీపీసీ అధ్యక్షుడు తాహా మహమ్మద్ కూడా మాట్లాడారు. ఆధునిక ఖతార్ అభివృద్ధిలో మాజీ అమీర్ చేసిన సేవలను కొనియాడుతూ, భారత్‌తో ఆయనకు ఉన్న స్నేహబంధం, భారతీయ ప్రవాసుల సంక్షేమానికి అందించిన సహకారాన్ని స్మరించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com