బెలారస్‌లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!

- July 16, 2026 , by Maagulf
బెలారస్‌లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ నేషనల్ మ్యూజియం ఆధ్వర్యంలో "ది స్ప్లెండర్ ఆఫ్ సిల్వర్: ట్రెజర్స్ ఫ్రం ది ఒమాని కోర్ట్" పేరిట ప్రత్యేక ప్రదర్శన బెలారస్‌లోని విటెబ్స్క్ స్థానిక చరిత్ర మ్యూజియంలో ప్రారంభమైంది. 35వ అంతర్జాతీయ కళోత్సవం "స్లావియాన్స్కీ బజార్" సందర్భంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంలో ఒమన్ జాతీయ మ్యూజియం ప్రధాన కార్యదర్శి జమాల్ బిన్ హసన్ అల్-మూసావీ, బెలారస్ సాంస్కృతిక మంత్రి మరాత్ సెర్గేయేవిచ్ మార్కోవ్, విటెబ్స్క్ ప్రాంతీయ కార్యనిర్వాహక కమిటీ ఉపాధ్యక్షుడు అలెక్సీ వ్లాదిమిరోవిచ్ గైడా పాల్గొన్నారు.

ఈ ప్రదర్శనలో మస్కట్, జాంజిబార్ పాలించిన ఒమన్ సుల్తాన్లకు చెందిన అరుదైన వెండి ఆభరణాలు, రాజభవనంలో ఉపయోగించిన విలువైన వస్తువులను ప్రదర్శిస్తున్నారు. ఒమాన్ వెండి కళాఖండాల వైభవం, కళాత్మక నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే దీని లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ఆగస్టు 16 వరకు కొనసాగనుంది.

ప్రారంభ కార్యక్రమంలో జమాల్ బిన్ హసన్ అల్-మూసావీ మాట్లాడుతూ.. బెలారస్‌లోని ఈ అంతర్జాతీయ సాంస్కృతిక ఫెస్టివల్ ను ఒమన్ తొలిసారిగా పాల్గొనడం చారిత్రక ఘట్టమని అన్నారు. 2018లో వారసత్వం, సంస్కృతి రంగాల్లో కుదిరిన అవగాహన ఒప్పందాల ఫలితంగానే ఈ ప్రదర్శన సాధ్యమైందని, ఇరు దేశాల మధ్య మ్యూజియంలు, పరిశోధన, విద్యా రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని తెలిపారు. ఒమన్ సాంస్కృతిక వారసత్వాన్ని బెలారస్ ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ ప్రదర్శన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.  

ఐదు ప్రధాన విభాగాలుగా విభజన

ఈ ప్రదర్శనను ఐదు ప్రధాన విభాగాలుగా రూపొందించారు. ఒమాని ఖంజర్ (సాంప్రదాయ కత్తి), సుగంధ సంస్కృతి, వెండి కళాఖండాలు, సాంప్రదాయ వస్త్రధారణ, తూర్పు ఆఫ్రికాలోని ప్రముఖ ఒమాని వ్యక్తుల రాజరిక దుస్తులు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.

ప్రదర్శనలో ఒమన్ జాతీయ చిహ్నంగా గుర్తింపు పొందిన ఖంజర్ చరిత్ర, దాని వివిధ రకాల నమూనాలు, అల్ సయీద్ రాజవంశానికి ప్రత్యేకంగా రూపొందించిన సయీది ఖంజర్, అలాగే యెమెన్ మాజీ అధ్యక్షుడు అలి అబ్దుల్లా సాలెహ్ దివంగత సుల్తాన్ ఖాబూస్ బిన్ సయీద్‌కు బహూకరించిన జాంబియా కంజర్ ను  ప్రదర్శిస్తున్నారు.

అదేవిధంగా, ప్రపంచ ప్రఖ్యాత అమౌజ్ గోల్డ్ సుగంధ ద్రవ్యాల తొలితరం సీసాలు, 24 క్యారెట్ల బంగారం, వెండితో తయారైన సుగంధ పాత్రలు, వెండి ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు, మహిళల ఆభరణాలు, సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ వ్యక్తిగత సేకరణలోని అరుదైన కవచం, పురాతన తుపాకీ వంటి చారిత్రక వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన బెలారస్‌లోని విటెబ్స్క్ స్థానిక చరిత్ర మ్యూజియం.. ప్రముఖ వారసత్వ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రదర్శనతో ఒమన్ సంస్కృతి, చరిత్రను అంతర్జాతీయ వేదికపై మరింత విస్తృతంగా పరిచయం చేసే అవకాశం లభించిందని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com