తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- July 17, 2026
హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) పనితీరును రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్షించారు. ఈ సందర్భంగా సైబర్ ల్యాబ్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సెంట్రల్ మానిటరింగ్ యూనిట్, సోషల్ మీడియా యూనిట్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, డిజిటల్ ఫోరెన్సిక్ యూనిట్లను పరిశీలించి, సైబర్ నేరాల దర్యాప్తులో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షించారు.
టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ సీనియర్ అధికారులు సైబర్ నేరాల తాజా ధోరణులు, దర్యాప్తు పద్ధతులు, భవిష్యత్ సాంకేతిక కార్యాచరణ పై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఐ ఆధారిత సైబర్ కాల్ సెంటర్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆర్థిక మోసంపై ఫిర్యాదు చేసిన బాధితుడితో వ్యవస్థ స్పందించిన తీరు, కీలక సమాచారాన్ని సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం పంపిన విధానాన్ని పరిశీలించిన అనంతరం, పౌరులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఇటువంటి ఏఐ ఆధారిత సేవలను విస్తరించాలని అధికారులను డీజీపీ ఆనంద్ ఆదేశించారు.
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని సమీక్షలో వెల్లడైంది. 2025లో 2024తో పోలిస్తే సైబర్ మోసాల వల్ల కలిగిన ఆర్థిక నష్టాలు 20 శాతం తగ్గాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో 21,639 సైబర్ నేరాల ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల ఎఫ్ఐఆర్లలో తెలంగాణ వాటా 44 శాతంగా ఉండటంతో ఈ విభాగంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
రూ.75 లక్షలకు పైబడిన అధిక విలువ గల సైబర్ మోసాల కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు రేటు 78 శాతానికి చేరిందని అధికారులు వెల్లడించారు. అలాగే మోసగాళ్ల బ్యాంకు ఖాతాల్లో నిలిపివేసిన నగదు రూ.255 కోట్ల నుంచి రూ.279 కోట్లకు పెరిగినట్లు తెలిపారు.
అయితే కొన్ని కీలక సూచికల్లో రాష్ట్రం మెరుగుపడాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ పనితీరు సూచికల్లో గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మెకానిజంలో తెలంగాణ నాలుగో స్థానంలో, కోఆర్డినేషన్లో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ, మనీ రీఫండ్ మెకానిజంలో 18వ స్థానం, 'సహయోగ్' పోర్టల్‌లో 17వ స్థానంలో ఉండటం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. బాధితులకు నగదు రీఫండ్, అంతర్శాఖల సమన్వయాన్ని అత్యవసర ప్రాధాన్యంగా తీసుకుని లోటుపాట్లను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో నమోదవుతున్న ప్రతి నాలుగు ప్రధాన నేరాల ఎఫ్ఐఆర్లలో ఒకటి సైబర్ నేరానిదేనని, సైబర్ మోసాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం సంభవించగా, ఇతర ప్రధాన నేరాల వల్ల కలిగిన నష్టం రూ.207 కోట్లుగా నమోదైందని సమీక్షలో వెల్లడైంది. దీంతో సైబర్ నేరాలు రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా మారాయని పేర్కొన్నారు.
సైబర్ నేరాల దర్యాప్తును ప్రత్యేక విభాగంగా కాకుండా పోలీసింగ్‌లో కీలక భాగంగా పరిగణించాలని, ప్రతి పోలీసు అధికారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక డేటా విశ్లేషణ పద్ధతులను వినియోగించాలని సూచించారు. పెట్టుబడి మోసాలు, ఆన్లైన్ మోసాల కారణంగా కుటుంబాలు జీవితకాల పొదుపులను కోల్పోతున్న నేపథ్యంలో సాంకేతికత, వేగవంతమైన స్పందన, సున్నా సహన విధానంతో తెలంగాణను దేశంలోనే సైబర్ పోలీసింగ్‌లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్‌లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్‌కామ్ నోటిఫికేషన్..
- డౌన్‌టౌన్ దుబాయ్‌లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి







