బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!

- July 18, 2026 , by Maagulf
బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!

షార్జా: సరదాగా చేసిన తొలి ఈ-బైక్ ప్రయాణం ఓ ఎమిరాటీ యువకుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 2023 డిసెంబర్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్ర మెదడు గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అతడు, రెండున్నరేళ్ల చికిత్స, పునరావాసం తర్వాత కోలుకుని ఇప్పుడు యూఏఈ నేషనల్ సర్వీస్ ‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు.

2023 డిసెంబర్ 9న జరిగిన ప్రమాదం అనంతరం యువకుడిని అబుదాబిలోని షేక్ ఖలీఫా మెడికల్ సిటీ (SKMC)కి తరలించారు. సీటీ స్కాన్‌లో మెదడులో తీవ్ర రక్తస్రావం (సబ్‌అరాక్నాయిడ్, సబ్‌డ్యూరల్ హీమరేజ్) ఉన్నట్లు గుర్తించారు. మెదడులో ఒత్తిడి ప్రమాదకర స్థాయికి చేరడంతో వెంటిలేటర్‌పై ఉంచి, మరుసటి రోజే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. మెదడుపై ఒత్తిడి తగ్గించేందుకు పుర్రె ఎముకలోని ఒక భాగాన్ని తాత్కాలికంగా తొలగించారు.

సుమారు మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన యువకుడికి న్యూరో సర్జన్లు, ఐసీయూ నిపుణులు, పునరావాస వైద్యులు కలిసి ప్రత్యేక వైద్యం అందించారు. తీవ్రమైన మెదడు గాయాల చికిత్సకు పలు విభాగాల సమన్వయం అత్యంత అవసరమని, ఈ కేసులో వైద్య బృందం సాధించిన ఫలితాలు సంతోషకరమని ఎస్‌కేఎంసీ క్రిటికల్ కేర్ విభాగం ఛైర్మన్ డాక్టర్ ముసాబ్ అలీ అల్ రమ్సీ తెలిపారు.

వైద్యుల అంచనాలను మించి యువకుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. అతని స్పృహ స్థాయిని సూచించే గ్లాస్గో కోమా స్కేల్ స్కోరు 11/15కు చేరుకుంది. మాట్లాడే స్థితికి రావడంతో దీర్ఘకాలిక పునరావాస చికిత్సను ప్రారంభించారు. ప్రమాదం కారణంగా దాదాపు రెండున్నరేళ్ల పాటు చదువుకు అంతరాయం ఏర్పడినా, పట్టుదలతో తిరిగి చదువును కొనసాగించి 2026 జూన్‌లో హైస్కూల్ విద్యను విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రస్తుతం 18 ఏళ్ల వయస్సులో ఉన్న అతడు మంచి ఆరోగ్యంతో యూఏఈ జాతీయ సేవలో చేరి దేశానికి సేవ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అతని తల్లి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com