జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- July 19, 2026
జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
ముంబై: IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకులోని మెజారిటీ వాటాను విదేశీ సంస్థకు విక్రయించేందుకు సిద్ధమవడాన్ని తప్పుబడుతూ జులై 27, 2026న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చాయి. ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడిబిఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్’ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు పెద్ద ఎత్తున బ్రేక్ పడే అవకాశం ఉంది.
కెనడా సంస్థ బిడ్.. బ్యాంకింగ్ చరిత్రలోనే భారీ ఎఫ్‌డీఐ
IDBI బ్యాంకును ప్రైవేటీకరించే ప్రక్రియలో భాగంగా కేంద్రానికి భారీ ఆఫర్ వచ్చింది. కెనడాకు చెందిన ప్రముఖ దిగ్గజం ‘ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్’ ఈ బ్యాంకులో 60 శాతం కంటే ఎక్కువ నియంత్రణ వాటాను కొనుగోలు చేయడానికి సుమారు 5.5 బిలియన్ డాలర్ల (రూ. 45 వేల కోట్లకు పైగా) భారీ బిడ్‌ను దాఖలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన వార్తలు వినవచ్చినప్పటి నుండి మార్కెట్లో ఐడీబీఐ బ్యాంక్ స్టాక్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు (Volatility) లోనవుతోంది.ఈ డీల్ గనుక ఓకే అయితే భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా (FDI) నిలవనుంది. దీనివల్ల బ్యాంకు అప్పులు తగ్గి, మరింత వృద్ధి చెందుతుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నా.. ఉద్యోగులు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల ఆందోళన ఏంటి? రిజర్వేషన్ల భయం
గత ఆరేళ్లుగా బ్యాంకు నిలకడగా లాభాలు (Profits) ఆర్జిస్తున్నప్పటికీ ప్రైవేట్ పరం చేయడం వెనుక ఆంతర్యమేంటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేటీకరణ జరిగితే తమ ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండదని, పెన్షన్లు, సామాజిక భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రస్తుతం 3,000 మందికి పైగా ఎస్సీ (SC), 1,200 మందికి పైగా ఎస్టీ (ST), 5,600 మందికి పైగా ఓబీసీ (OBC), 800 మందికి పైగా ఈడబ్ల్యూఎస్ (EWS) మరియు 880 మందికి పైగా దివ్యాంగ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ప్రైవేట్ హస్తగతమైతే తమకు రిజర్వేషన్ నిబంధనలు వర్తించవని వారు భయపడుతున్నారు. పీఎం జన్ ధన్ యోజన, పీఎం సురక్షా బీమా యోజన, జీవన్ జ్యోతి వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాంకును ప్రైవేట్ చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమని సంఘాలు పేర్కొన్నాయి.
కస్టమర్లకు అలర్ట్.. ఆ పనులు ముందే చూసుకోండి
జులై 27న జరగబోయే ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ బ్రాంచ్‌లలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. కౌంటర్లలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, లోకల్ చెక్కుల క్లియరెన్స్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్ (DD) జారీ వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. అందువల్ల అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉన్న కస్టమర్లు సమ్మె రోజు కంటే ముందే పూర్తి చేసుకోవడం మంచిది. సమ్మె రోజున బ్రాంచ్‌లు మూతపడినా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ మరియు ఏటీఎం (ATM) సేవలు యథావిధిగా పనిచేస్తాయని, కస్టమర్లు ఆన్లైన్ మాధ్యమాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







