తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- July 19, 2026
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (TTD) అదిరిపోయే శుభవార్త అందించింది. కొండ పై వసతి గదుల (Accommodation) కోసం భక్తులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతూ సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై కేంద్రీయ విచారణ కార్యాలయం (CRO) వద్ద గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఉప విచారణ కార్యాలయాల (Sub Enquiry Offices) ద్వారా వేగంగా రూమ్‌లను కేటాయిస్తోంది.
ఆధునిక సాంకేతికతతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ
వసతి గదులు కావాలనుకునే సామాన్య భక్తులు తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్దకు వెళ్లి ఈ కింది పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి గదులు అందుబాటులో ఉన్నంత వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయి. కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే క్యూలైన్లో నిలబడాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా దాని జిరాక్స్ కాపీతో పాటు మొబైల్ నంబర్ అందించాలి. దళారుల బెడదను అరికట్టేందుకు భక్తుల ముఖ గుర్తింపు (Face Recognition System) ద్వారా వివరాలు నమోదు చేసి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తారు. క్యూలో ఉండే భక్తులకు టీటీడీ ఉచితంగా తాగునీరు, అల్పాహార సదుపాయాలు కల్పిస్తోంది.
రూమ్స్ రేట్లు–కేటగిరీలు (Room Tariff):
భక్తులు తమ బడ్జెట్‌ను బట్టి రిజిస్ట్రేషన్ సమయంలోనే రెండు కేటగిరీలలో గదులను ఎంచుకోవచ్చు.
A కేటగిరీ: రూ.50 మరియు రూ. 100 అద్దె గల సాధారణ గదులు.
B కేటగిరీ: రూ.1000 అద్దె గల ఆధునిక వసతి గదులు.
ఎస్ఎంఎస్ లేదా కియోస్క్ ద్వారా అలాట్మెంట్ సమాచారం
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత భక్తులు సీఆర్వో వద్దే వేచి ఉండాల్సిన అవసరం లేదు. సీఆర్వో వద్ద ఉన్న డిజిటల్ డిస్ప్లే బోర్డులపై క్రమ సంఖ్యలను ప్రదర్శిస్తారు. మీ నంబర్ బోర్డుపై వచ్చిన 15 నిమిషాల్లోపు మీరు రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్‌కు రూమ్ అలాట్మెంట్ ఎస్ఎంఎస్ (SMS) వస్తుంది. ఒకవేళ సిగ్నల్ సమస్యల వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే, అక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ కియోస్క్ మెషీన్లలో మీ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌ను స్కాన్ చేయడం ద్వారా మీకు ఏ సబ్ ఆఫీసులో రూమ్ కేటాయించారో సులభంగా తెలుసుకోవచ్చు.
క్యాష్ లెస్ పేమెంట్స్.. ఆన్లైన్ ద్వారానే చెల్లింపు
ఎస్ఎంఎస్ సమాచారం అందిన వెంటనే భక్తులు నేరుగా తమకు కేటాయించిన ఉప విచారణ కార్యాలయానికి (ఉదాహరణకు: ANC, SNC, SMC, GNC కాటేజీలు, కౌస్తుభం, నందకం, పాంచజన్యం, సప్తగిరి విశ్రాంతి గృహాలు) వెళ్లాలి.సదరు కార్యాలయంలో గది అద్దెను కేవలం ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ లేదా క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లించాలి. నగదు (Cash) రూపంలో రూపాయి కూడా తీసుకోరు. పేమెంట్ పూర్తయిన వెంటనే గది తాళాలు అందజేస్తారు.
భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నిబంధనలు
తిరుమల వసతి గదుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టీటీడీ కొన్ని కఠినమైన రూల్స్ పెట్టింది.
వయోపరిమితి: గది పొందే వ్యక్తికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఒంటరి వ్యక్తులకు నో రూమ్: ఒంటరి వ్యక్తులకు (Single Person) మరియు అవివాహితులకు (Unmarried Couples) కొండపై గదులు కేటాయించరు.
కాలపరిమితి 24 గంటలే: గదులను కేవలం 24 గంటల పరిమితికే ఇస్తారు. గడువు దాటితే 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం అదనపు జరిమానా విధిస్తారు.
లాకింగ్ పీరియడ్: ఒకసారి రూమ్ పొందిన భక్తుడు, తిరిగి 30 రోజుల వరకు తిరుమలలో మరో గదిని పొందేందుకు అర్హుడు కాడు.
కాషన్ డిపాజిట్: గదిని పొందిన భక్తుడే స్వయంగా కౌంటర్‌కు వచ్చి ఖాళీ చేయాలి, లేదంటే కాషన్ డిపాజిట్ వెనక్కి ఇవ్వరు. రూమ్‌ను ఇతరులకు బదలాయించడం నేరం.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







