మైన్స్‌ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

- September 03, 2026 , by Maagulf
మైన్స్‌ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: మంగళగిరిలోని మయూరి టెక్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన గనులు, భూగర్భ వనరుల శాఖ డైరెక్టరేట్‌ కొత్త కార్యాలయాన్ని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం ప్రారంభించారు. మైనింగ్‌ రంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచడంతో పాటు ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

కొత్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన కెమికల్‌ ల్యాబ్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, రికార్డు రూమ్‌, మైన్స్‌ ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల మైనింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. వేలం వేసిన గనులు అనుమతులు, భూమి సమస్యల వద్ద ఆగిపోకుండా ఉత్పత్తి దశకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

2025-26లో మైన్స్‌ శాఖ రూ.3,416 కోట్ల ఖనిజ ఆదాయం సాధించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 32 శాతం అధికమని మంత్రి తెలిపారు. ఇతర వసూళ్లతో కలిపి మొత్తం ఆదాయం రూ.4,339 కోట్లకు చేరిందన్నారు. 2026-27లో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రూ.1,287.33 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.

2025-26లో 21 ప్రధాన ఖనిజ గనులను వేలం వేసినట్లు తెలిపారు. గత రెండేళ్లలో దాదాపు 450 లీజులు మంజూరు చేశామన్నారు. ఉచిత ఇసుక విధానం ద్వారా జూలై 2024 నుంచి సుమారు 2.1 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఇసుకను సరఫరా చేశామని చెప్పారు. కడప బేసిన్‌లో లిథియం, గాలియం అన్వేషణను CSIR-NGRIతో కలిసి చేపడుతున్నట్లు తెలిపారు. జొన్నగిరిలో వాణిజ్య బంగారం ఉత్పత్తి ప్రారంభమైందన్నారు.

అక్రమ మైనింగ్‌, ఖనిజాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,000 ANPR కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లు, ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు.

మైన్స్‌ డైరెక్టర్ డబ్ల్యూ.బి. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో మైనింగ్‌ కార్యకలాపాలపై నిఘాను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారం, తనిఖీలు, అక్రమ మైనింగ్‌ నియంత్రణ, జిల్లా అధికారులతో సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

కార్యక్రమంలో అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, శ్రీనివాస చౌదరి, రవి చంద్‌, జిల్లా మైనింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com