ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!

- July 22, 2026 , by Maagulf
ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ \'కేర్ సమ్మర్\' కార్యక్రమం..!!

దోహా: ఖతార్‌లోని ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) విద్యార్థుల కోసం 'కేర్ సమ్మర్' పేరుతో ఉచిత ఫీల్డ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆగస్టు 2026 ప్రారంభంలో చేపట్టనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 12 నుంచి 18 ఏళ్ల వయస్సు గల ఖతార్ పౌరులు, నివాసిత విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ శిక్షణ కార్యక్రమం ఆగస్టు 3 నుంచి ఆగస్టు 26వరకు ప్రతి సోమ, మంగళ, బుధ వారాల్లో నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్టుల్లో శిక్షణ ఉంటుంది. మొత్తం 12 రోజుల పాటు 36 గంటల ఫీల్డ్ ట్రైనింగ్ అందించనున్నారు.

ఆరు ఆరోగ్య కేంద్రాల్లో శిక్షణ
బాయ్స్ కోసం అల్ సాద్, అల్ వజ్బా, ఉమ్ సలాల్ ఆరోగ్య కేంద్రాలను, గరల్స్ కోసం అల్ తుమామా, ముఐథర్, లెఅబైబ్ ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. విద్యార్థులు నిజమైన ఆరోగ్య సేవల వాతావరణంలో ప్రత్యక్ష అనుభవం పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థుల్లో ఆరోగ్య రంగంపై ఆసక్తిని పెంపొందించడం, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, భవిష్యత్ కెరీర్‌కు సరైన దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఆరోగ్య కేంద్రాల్లోని వివిధ విభాగాల పనితీరు, వైద్య సేవలు, ప్రజారోగ్య రంగంలోని అవకాశాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.

అదే సమయంలో, ఆరోగ్య సిబ్బందిపై గౌరవాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న 'యాంటీ-వయోలెన్స్' ప్రచారంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సిబ్బంది ఎదుర్కొనే సవాళ్లు, వారి సేవల ప్రాముఖ్యత, వారికి చట్టపరంగా ఉన్న రక్షణ గురించి వివరించనున్నారు.

కార్యక్రమానికి సంబంధించిన నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను పీహెచ్‌సీసీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో విడుదల చేస్తుంది. విద్యార్థులు తమకు అనుకూలమైన ఆరోగ్య కేంద్రం, శిక్షణ షిఫ్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నమోదు కోసం తల్లిదండ్రుల సమ్మతితో పాటు తల్లిదండ్రుల ఖతార్ ఐడీ ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు సంస్థ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com