సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!

- July 23, 2026 , by Maagulf
సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!

రియాద్: సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత బలంగా కొనసాగుతున్నాయని ఇరు దేశాల సీనియర్ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సోదర భావ సంబంధాలను ప్రతిబింబించేలా బాధ్యతాయుతంగా వార్తలను ప్రచారం చేయాలని మీడియాకు సూచించారు. సౌదీ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ చైర్మన్ తుర్కీ అల్ అల్‌షేఖ్ తన ఎక్స్ (X) అకౌంట్లో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్, యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాని, ప్రెసిడెన్షియల్ కోర్టు చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.

ఆ ఫొటోకు "సౌదీ అరేబియా, యూఏఈలది సోదర భావంతో కూడిన చిరస్థాయి భాగస్వామ్య గాథ" అని ఆయన కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన యూఏఈ అధ్యక్ష దౌత్య సలహాదారు అన్వర్ గర్గాష్, "గల్ఫ్ ప్రాంతంలో అతిపెద్ద కథ ఈ ఒక్క ఫొటోలోనే కనిపిస్తుంది" అని పేర్కొన్నారు.

సౌదీ మీడియా మంత్రి సల్మాన్ అల్ దోసరి మాట్లాడుతూ..  సౌదీ–యూఏఈ సంబంధాలు ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఇరు దేశాల దూరదృష్టి కలిగిన నాయకత్వంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. తమ ప్రజల అభివృద్ధి కోసం ఇరు దేశాలు ప్రతిష్ఠాత్మక అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల సంబంధాలపై తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడం, వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను ధృవీకరించడం బాధ్యతాయుత మీడియా కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.

యూఏఈ నేషనల్ మీడియా ఆఫీస్ చైర్మన్ అబ్దుల్లా అల్ హమేద్ మాట్లాడుతూ..  యూఏఈ–సౌదీ సంబంధాలు ఉమ్మడి చరిత్ర, సోదర ప్రజల మధ్య ఉన్న గాఢమైన బంధానికి ప్రతీక అని అన్నారు. ఇరు దేశాల నాయకత్వాల మధ్య ఉన్న సన్నిహిత సమన్వయం, ఉమ్మడి అభివృద్ధి దృష్టికోణం ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. బాధ్యతాయుత మీడియా ఈ వాస్తవాలను నిష్పాక్షికంగా ప్రజలకు అందించడంతో పాటు, ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీయాలనే ప్రయత్నాలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com