గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!

- July 23, 2026 , by Maagulf
గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!

కువైట్ సిటీ: బంగారం, విలువైన లోహాలు, రత్నాల వ్యాపారంలో మనీలాండరింగ్ (AML) మరియు ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడాన్ని అరికట్టేందుకు కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి తప్పనిసరిగా నివేదించేందుకు 17 కీలక హెచ్చరిక సూచికలను (Red Flags) ఇందులో చేర్చింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. నిధుల మూలాన్ని దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు నిరాకరించడం, నకిలీ గుర్తింపు పత్రాలు ఉపయోగించడం, ధరతో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేయడం, లావాదేవీ ఉద్దేశాన్ని వివరించలేకపోవడం వంటి అంశాలు అనుమానాస్పద సంకేతాలుగా పరిగణిస్తారు.

అయితే, ఒకే ఒక్క అనుమానాస్పద సూచిక కనిపించిందని మాత్రమే నేరం జరిగినట్లు భావించరాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాంటి సందర్భాల్లో మరింత లోతుగా పరిశీలన చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే, లావాదేవీని రద్దు చేసినా లేదా మధ్యలో నిలిపివేసినా, అనుమానం ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి మినహాయింపు ఉండదని పేర్కొంది.

బంగారం, విలువైన లోహాల రంగం మనీలాండరింగ్‌కు ఎక్కువగా గురయ్యే అవకాశమున్న రంగాల్లో ఒకటిగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్రమంగా సంపాదించిన డబ్బును బంగారంగా మార్చడం, నివేదికల పరిమితిని తప్పించుకునేందుకు పెద్ద మొత్తాలను చిన్నచిన్న లావాదేవీలుగా విభజించడం, అసలు లబ్ధిదారుడిని దాచిపెట్టేందుకు మూడో వ్యక్తులు లేదా షెల్ కంపెనీలను ఉపయోగించడం వంటి పద్ధతులు తరచుగా ఉపయోగిస్తున్నట్లు హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com