విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- July 24, 2026
న్యూ ఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేసిన వీడియో సందేశంపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రధాని ఇలాంటి వీడియో సందేశాలను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. “విద్యార్థుల తెలివితేటలను తక్కువ అంచనా వేస్తూ వారిని అవమానించవద్దు” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul) ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హితవు పలికారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుకుంటున్నారని, వారి ఆవేదనను పట్టించుకోకుండా మోదీ వీడియోలు చేయడం సరైంది కాదన్నారు. వెంటనే ప్రధాని విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడింది: సోనియా గాంధీ
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు.
నిరసనల పై అణచివేత: ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
ఎన్‌టీఏ వైఫల్యాలు: గత 12 ఏళ్లలో 152 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, అందులో 2017లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పడిన తర్వాతే 9 లీకేజీలు జరిగాయని గుర్తుచేశారు.
సంస్కరణల తిరస్కరణ: ఎన్‌టీఏను బలోపేతం చేయడానికి పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులను కేవలం విపక్ష సభ్యులు ఉన్నారనే కారణంతో కేంద్రం తిరస్కరించిందని, ఇది అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. “మోదీ గారూ.. మీరు పార్లమెంట్‌కు వచ్చే ముందే ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించండి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్ల ప్రయోగానికి ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోండి. విద్యార్థులకు క్షమాపణ చెప్పిన తర్వాతే విద్యా వ్యవస్థపై సమగ్ర చర్చకు మేము సిద్ధంగా ఉంటాం” అని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
- తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోల్ ఫ్లీట్లోకి ‘మాన్సోరీ ఫెరారీ 812’
- సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో షేక్ మహమ్మద్ భేటీ
- మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- ఏఐ న్యాయమూర్తి మనస్సాక్షిని, న్యాయ విచక్షణను భర్తీ చేయలేదు: జస్టిస్ సురేపల్లి నందా
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి







