సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్

- July 24, 2026 , by Maagulf
సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్

హైదరాబాద్: పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌నే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చుకోవాలని తెలంగాణ డీజీపీ సీ.వీ.ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ సైబర్ భద్రత ప్రమాణాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో అన్ని యూనిట్ అధికారుల పనితీరును మరింత మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు.

సైబర్ సెక్యూరిటీ, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ (e-Zero FIR), క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS) అమలుపై అన్ని పోలీసు యూనిట్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. రాష్ట్రాల సైబర్ భద్రతా పనితీరును ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) తొమ్మిది కీలక పనితీరు సూచికల ఆధారంగా క్రమం తప్పకుండా సమీక్షిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాల్సి ఉందని పేర్కొన్న డీజీపీ, ప్రతి యూనిట్‌లో దీని సమర్థ అమలుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇటీవల కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 20 ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన T-SPARK మరియు TCSB బృందాలను ఆయన అభినందించారు.

ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పనితీరు పలు విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం:

  • ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌లో 13వ స్థానం,
  • మనీ రీస్టోరేషన్‌లో 18వ స్థానం (46.6 శాతం నిధుల రికవరీ),
  • GRMలో 4వ స్థానం,
  • సహయోగ్ పోర్టల్‌లో 16వ స్థానం,
  • సమన్వయ పోర్టల్‌లో 6వ స్థానం,
  • సోషల్ మీడియా పనితీరులో 16వ స్థానం,
  • సైబర్ సెక్యూరిటీలో 15వ స్థానం,
  • కెపాసిటీ బిల్డింగ్‌లో 8వ స్థానంలో ఉందని వివరించారు.

ఈ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు సిబ్బంది శిక్షణ (Capacity Building), ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు (IEC Activities) మరింత విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి సైబర్ నేర దర్యాప్తులో CCTNS వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com