పేపర్‌ లీక్‌ల పై కఠిన చట్టం...

- July 27, 2026 , by Maagulf
పేపర్‌ లీక్‌ల పై కఠిన చట్టం...

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు మరియు అక్రమాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026’ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇటీవల నీట్ (NEET) సహా వివిధ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లుపై లోక్‌సభలో జరిగే చర్చలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన బిల్లుపై హౌస్‌ను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని, ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించకుండా తమ అభిప్రాయాలను మరియు సూచనలను వెల్లడించాలని కోరారు. ఈ చర్చలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు కీలక ఎంపీలు పాల్గొననున్నారు.

సవరణ బిల్లులోని 7 కీలక ప్రతిపాదనలు
ఈ బిల్లును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చేర్చిన ముఖ్యమైన నిబంధనలు:

కఠినమైన జైలు శిక్ష: పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేలా సవరణలు చేశారు.
భారీ జరిమానాలు: వ్యక్తులకు విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచారు.
సర్వీస్ ప్రొవైడర్లపై చర్యలు: అక్రమాలకు సహకరించే ఏజెన్సీలు లేదా సర్వీస్ ప్రొవైడర్లపై జరిమానాను రూ. 1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అంతేకాకుండా వారిని పరీక్షల నిర్వహణ నుంచి నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించారు. కంపెనీ డైరెక్టర్లకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ & గడువు: పరీక్షల కుంభకోణాలపై విచారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు. పోలీసులు లేదా సీబీఐ విచారణను 2 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి రోజువారీ విచారణ జరుపుతారు. ఈ సమావేశాల్లోనే ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లు-2026’ను కూడా లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును చట్టంగా మార్చనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com