తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం

- July 27, 2026 , by Maagulf
తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం

డాలస్, టెక్సస్: తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. 
“ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది.

యునైటెడ్ కింగ్డమ్ లో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా.చంద్ర చెరువు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించగల్గడం అదృష్టంగా భావిస్తున్నామని, ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.”        
   
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాలనుండి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు.     

విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా.వి.కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా.శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే డా.పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. 

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com