కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!

- July 27, 2026 , by Maagulf
కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!

మస్కట్: కొత్త అంటువ్యాధి వెలుగుచూసిన క్రమంలో ప్రజలు, అత్యవసర వైద్య సేవల విభాగం ఎలా స్పందించాలనే దానిపై ఒమాన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నేషనల్ రిస్క్ రిజిస్టర్ సహకారంతో జారీ చేసిన ఈ సూచనల్లో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని తెలియజేసింది.

CDAA మార్గదర్శకాల ప్రకారం.. అంబులెన్స్ సిబ్బంది అనుమానిత రోగులను గుర్తించి సురక్షితంగా నిర్వహించడం, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ చర్యలను కచ్చితంగా అమలు చేయడం, వైద్య నిబంధనలకు అనుగుణంగా రోగులను తరలించడం, వినియోగం అనంతరం అంబులెన్స్‌లు, వైద్య పరికరాలను పూర్తిగా శుభ్రపరచడం, ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంస్థలతో సమన్వయం కొనసాగించడం వంటి బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రజలు అధికారిక ఆరోగ్య శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, లక్షణాలు కనిపిస్తే ఇతరులతో సన్నిహితంగా ఉండకూడదని, అవసరమైతే వెంటనే వైద్య సేవలను ఆశ్రయించాలని సీడీఏఏ సూచించింది. అత్యవసర సహాయం కోరే సమయంలో లక్షణాలు, ఇటీవల ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్న వివరాలను నిజాయితీగా తెలియజేయాలని కోరింది. అలాగే అధికారులతో సహకరిస్తూ సమాజ రక్షణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేసింది.

లక్షణాలు కనిపించిన వెంటనే ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లకూడదని, ఇతరులతో కలవకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అత్యవసర వైద్య సేవలను సంప్రదించి, ఆరోగ్య అధికారుల సూచనలను పూర్తిగా పాటించాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 9999 నంబర్‌కు కాల్ చేయాలని ఒమాన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ ప్రజలకు గుర్తు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com