రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

- July 28, 2026 , by Maagulf
రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూ ఢిల్లీ: కాగితపు కరెన్సీ కంటే మెరుగైన మన్నిక, ఎక్కువ కాలం మనుగడ సాగించే పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను క్షేత్రస్థాయి ప్రయోగాల (Field Trials) కోసం ప్రవేశపెట్టాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఫీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా ప్రారంభంలో రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కో బిలియన్ చొప్పున పాలిమర్ నోట్లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తయిన తర్వాతే వీటిని క్రమం తప్పకుండా జారీ చేయాలని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా భర్తీ చేసే ఆలోచన ఏదీ లేదని.. కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా ఈ పాలిమర్ నోట్లను కూడా చలామణిలోకి తెస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పాలిమర్ నోట్ల ఉత్పత్తి
పాలిమర్ నోట్ల ఉత్పత్తి కోసం అంతర్నిర్మిత భద్రతా లక్షణాలతో కూడిన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్లను సరఫరా చేయడానికి ఆర్బీఐకి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ఇప్పటికే గ్లోబల్ టెండర్లను (EoI) ఆహ్వానించింది. ప్రారంభంలో సుమారు 68 వేల రీముల పాలిమర్ సబ్‌స్ట్రేట్ అవసరమని అంచనా వేశారు. ఈ టెండర్ ప్రక్రియలో కఠినమైన జాతీయ భద్రతా నిబంధనలను పొందుపరిచారు. సరఫరాదారులు చైనా లేదా పాకిస్తాన్‌ల నుండి ముడి పదార్థాలను సేకరించకూడదని, అలాగే భారత్ కోసం తయారుచేసిన సబ్‌స్ట్రేట్‌ను ఏ మూడవ దేశానికి సరఫరా చేయకూడదని షరతులు విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com