పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!

- July 28, 2026 , by Maagulf
పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!

మనామా: నెలలు నిండక ముందే జన్మించిన శిశువుకు సరైన వైద్య చికిత్స అందించకుండా నిర్లక్ష్యం వహించడంతో ఓ శిశువు మృతి చెందిన కేసులో తల్లిదండ్రులకు విధించిన మూడేళ్ల జైలు శిక్షను బహ్రెయిన్ ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ సమర్థించింది. శిశువు మృతదేహాన్ని అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఖననం చేసిన కేసులో తల్లి స్నేహితురాలికి విధించిన ఏడాది జైలు శిక్షను కూడా కోర్టు యథాతథంగా కొనసాగించింది.

దీంతోపాటు ఇల్లీగల్ రెసిడెన్సీ కేసులో ముగ్గురికీ ఒక్కో నెల జైలు శిక్ష విధించిన కోర్టు, శిక్ష పూర్తయ్యాక వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఈ ఘటన 2025 ఆగస్టులో జరిగింది. నివాస అనుమతికి సంబంధించిన సమస్యల కారణంగా గర్భధారణ సమయంలో వైద్య సేవలు తీసుకోని ఓ ఆసియా మహిళ బహ్రెయిన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లోనే నెలలు నిండక ముందే బిడ్డకు జన్మనిచ్చింది.

కోర్టు వివరాల ప్రకారం..  గర్భధారణ ఆరు నుంచి ఏడు నెలల దశలో ఉండగానే ఆమె ఒంటరిగా ప్రసవించింది. బొడ్డుతాడును కూడా స్వయంగా కోసుకున్నప్పటికీ, అకాల ప్రసవం జరిగిన శిశువుకు ఎలాంటి వైద్య సహాయం అందించలేదు. పుట్టిన సమయంలో శిశువు సజీవంగానే ఉన్నప్పటికీ, మరుసటి రోజు ఆరోగ్యం విషమించింది. ప్రత్యేక వైద్య చికిత్స అవసరమైనప్పటికీ తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో శిశువు మరణించాడు. శిశువు పుట్టిన విషయం, మరణించిన విషయాన్ని చట్టప్రకారం అధికారులకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ తల్లిదండ్రులు అలా చేయలేదు. అనంతరం తల్లి స్నేహితురాలి సహాయంతో తమ నివాసం సమీపంలో శిశువు మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారు.

దీంతో శిశువును నిర్లక్ష్యానికి గురిచేసి అవసరమైన వైద్య సేవలు అందించకపోవడం ద్వారా మరణానికి కారణమైనట్లు తల్లి (35), తండ్రి (26)పై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే అధికారులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఖననం చేసిన కేసులో తల్లి, ఆమె 39 ఏళ్ల స్నేహితురాలు దోషులుగా తేలగా, ఈ చర్యలో పాల్గొన్న తండ్రిని కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. ముగ్గురినీ శిక్ష అనంతరం బహ్రెయిన్ నుంచి బహిష్కరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com