దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- July 29, 2026
దుబాయ్: రాస్ అల్ ఖోర్ రోడ్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు ప్రారంభించడంతో పాటు ఎంట్రీ,ఎగ్జిట్ మార్గాలను విస్తరించినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. ఈ మార్పులతో రద్దీ సమయాల్లో వాహనదారుల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఆర్‌టీఏ ప్రకారం, ఈ అభివృద్ధి పనులతో రహదారుల సామర్థ్యం 20 శాతం పెరిగింది.
రాస్ అల్ ఖోర్ రోడ్‌లో ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్ జంక్షన్ నుంచి అల్ ఖైల్ రోడ్ దక్షిణ దిశ వరకు అదనంగా ఒక లేన్ ఏర్పాటు చేశారు. దీంతో మూడు లేన్లుగా ఉన్న రహదారి నాలుగు లేన్లుగా మారి, వాహనాల రాకపోకల సామర్థ్యం 33 శాతం పెరిగింది. అలాగే ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్ నుంచి మైదాన్ వైపు వెళ్లే ఎగ్జిట్, రాస్ అల్ ఖోర్ రోడ్ నుంచి ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్ వైపు వెళ్లే మార్గాన్ని కూడా అప్డేట్ చేశారు. దీంతో రాస్ అల్ ఖోర్ రోడ్ నుంచి అల్ ఖైల్ రోడ్ చేరేందుకు ప్రస్తుతం పడుతున్న 15 నిమిషాల ప్రయాణ సమయం 12 నిమిషాలకు తగ్గుతుందని ఆర్‌టీఏ తెలిపింది. అల్ ఖైల్ రోడ్‌లో అబుదాబి దిశగా ఒక కిలోమీటర్ పొడవున అదనపు లేన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మూడు లేన్లను నాలుగు లేన్లుగా విస్తరించడంతో రహదారి సామర్థ్యం 33 శాతం పెరిగింది. దీంతో రద్దీ వేళల్లో ట్రాఫిక్ సాఫీగా కదిలి ప్రయాణ సమయం 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో వేగవంతమైన పరిష్కారాలు అందించే ఆర్‌టీఏ కార్యక్రమంలో భాగంగానే ఈ పనులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇటీవల ఇదే మార్గంలో ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్ నుంచి రాస్ అల్ ఖోర్ రోడ్‌కు కొత్త ఎగ్జిట్, రాస్ అల్ ఖోర్ రోడ్ నుంచి అల్ ఖైల్ రోడ్ మీదుగా అల్ మైదాన్ స్ట్రీట్‌కు వెళ్లే ఎగ్జిట్-25 విస్తరణ పనులను కూడా పూర్తి చేసినట్లు తెలిపింది. ఇక బిజినెస్ బే ప్రాంతంలో కూడా పలు ట్రాఫిక్ మెరుగుదల చర్యలు అమలు చేసినట్లు ఆర్‌టీఏ వెల్లడించింది. దుబాయ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రహదారి మౌలిక సదుపాయాలను విస్తరించి, నివాసితులు, సందర్శకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







