సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..

- July 29, 2026 , by Maagulf
సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..

రియాద్: సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడి యత్నాన్ని సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా తిప్పికొట్టింది. గత కొన్ని గంటల వ్యవధిలో చమురు సౌకర్యాలపై దాడి చేసేందుకు ప్రయత్నించిన పలువురు మానవరహిత వైమానిక వాహనాలను (UAVలు) గుర్తించి, వాటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాల్కీ తెలిపారు.

సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఉగ్రదాడి ప్రయత్నాలు ఇరాక్ భూభాగం నుంచి మరోసారి ప్రారంభమయ్యాయని, వీటి వెనుక ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద మిలీషియా గుంపులు ఉన్నట్లు మేజర్ జనరల్ అల్-మాల్కీ ఆరోపించారు.

సౌదీ అరేబియా తన భూభాగం, జాతీయ ఆస్తులు మరియు కీలక మౌలిక వసతులను రక్షించుకునే హక్కు పూర్తిగా కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి ఉగ్రదాడులకు తగిన సమయంలో, తగిన ప్రదేశంలో సార్వభౌమ హక్కుల మేరకు సముచితంగా ప్రతిస్పందిస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ ఘటనతో తూర్పు ప్రాంతంలోని చమురు సౌకర్యాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ భద్రతా దళాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, కీలక మౌలిక వసతుల రక్షణ కోసం అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com