యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- July 29, 2026
అబుదాబి: యూఏఈలో ఏదైనా వ్యాపారం, రెస్టారెంట్ లేదా సేవపై నెగెటివ్ రివ్యూ పోస్ట్ చేసే ముందు వినియోగదారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అప్రమత్తంగా ఉండాలని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సేవలపై నిజాయితీతో కూడిన విమర్శలకు చట్టం అనుమతించినప్పటికీ, వ్యక్తిగత దూషణలు లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే అది పరువు నష్టం (డిఫమేషన్) నేరంగా పరిగణించబడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.
న్యాయవాది అహ్మద్ ఖలీల్ మాట్లాడుతూ.. ఉత్పత్తి లేదా సేవపై వ్యక్తిగత అనుభవం ఆధారంగా వాస్తవాలతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చట్టబద్ధమైన వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌గా పరిగణిస్తారని తెలిపారు. అయితే వ్యక్తిగత అవమానాలు, నిరాధార ఆరోపణలు లేదా దూషణలు ఉంటే అది నేరంగా మారుతుందని చెప్పారు.
ఇటీవల అబుదాబిలో ఓ ప్రముఖ రెస్టారెంట్‌పై వీడియో ప్రచురించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు కోర్టు మొత్తం Dh81,000 జరిమానా విధించింది. వీడియోలో రెస్టారెంట్ సేవలను విమర్శించడం కాకుండా యజమానిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు కోర్టు గుర్తించింది. ఈ కేసులో కోర్టు Dh30,000 క్రిమినల్ జరిమానా, వీడియో తొలగింపు, వీడియో షూట్ కు ఉపయోగించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేయడంతో పాటు, బాధితుడికి Dh51,000 తాత్కాలిక సివిల్ పరిహారం చెల్లించాలని ఆదేశించిందని గుర్తుచేశారు.
న్యాయ నిపుణుల ప్రకారం.. క్రిమినల్ జరిమానా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. సివిల్ పరిహారం మాత్రం పరువు నష్టం వల్ల నష్టపోయిన వ్యక్తికి చెల్లించాల్సి ఉంటుంది.
యూఏఈ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం డిజిటల్ వేదికల ద్వారా పరువు నష్టం కలిగించే కంటెంట్ ప్రచురిస్తే Dh250,000 నుంచి Dh500,000 వరకు జరిమానా, గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, కంటెంట్ ప్రచురించడానికి ఉపయోగించిన పరికరాల స్వాధీనం, విదేశీయులైతే దేశ బహిష్కరణ వంటి చర్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.
నిపుణులు సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు:
* సేవ లేదా ఉత్పత్తి నాణ్యతపై మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేయాలి.
* యజమాని వ్యక్తిత్వం, నిజాయితీ లేదా వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయకూడదు.
* ఆధారాలు లేని మోసం, మోసగాడు వంటి ఆరోపణలు చేయరాదు.
* తాము ఎదుర్కొన్న నిజమైన అనుభవాలనే వాస్తవాల ఆధారంగా పంచుకోవాలి.
"సేవ ఆలస్యంగా అందింది", "ఆహారం నాణ్యత నచ్చలేదు" వంటి వ్యాఖ్యలు సాధారణ వినియోగదారుల అభిప్రాయాలుగా పరిగణించబడతాయి. అయితే "ఇది మోసపూరిత సంస్థ", " సంస్థ యజమాని మోసగాడు" వంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్‌లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్‌లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్‌లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







