ఖతార్‌లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- July 29, 2026
దోహా: కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఖతార్ ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జనరల్ క్లీన్లీనెస్ డిపార్ట్‌మెంట్‌లో 3,200 మందికిపైగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. పని ప్రదేశంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చికిత్స అందించడమే ఈ క్లినిక్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
జనరల్ క్లీన్లీనెస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ ఫరాజ్ అల్ కుబైసీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వ్యర్థాల సేకరణ బాధ్యత తమ శాఖదేనని, వేలాది మంది కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ క్లినిక్‌లో జనరల్ వైద్యుడు, ఫార్మసీ, నర్సింగ్ సేవలు, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత వంటి సాధారణ ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. సాధారణ జబ్బులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కలిగే ఆరోగ్య సమస్యలకు ఇక్కడే చికిత్స అందిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే హమద్ హాస్పిటల్‌తో సమన్వయం చేసి వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. వివిధ షిఫ్టుల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు రెండు షిఫ్టుల్లో క్లినిక్ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
వేసవిలో కార్మికుల రక్షణ కోసం ఖతార్ అమలు చేస్తున్న నిబంధనలను తమ శాఖ పూర్తిగా పాటిస్తోందన్నారు. ఉదయం 4 గంటలకే పనులు ప్రారంభించి ఎండ తీవ్రత పెరగకముందే ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని అల్ కుబైసీ చెప్పారు. కార్మికుల ఆరోగ్యంపై పెట్టుబడి పెడితే ప్రజలకు అందించే పారిశుద్ధ్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా పరిశుభ్రత విషయంలో ఖతార్‌కు లభించిన అంతర్జాతీయ గుర్తింపు ఇందుకు నిదర్శనమని అన్నారు.
ఇదిలా ఉండగా, ప్రతి ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పనులు నిషేధిస్తూ ఖతార్ ప్రభుత్వం అమలు చేస్తున్న వేసవి కార్మిక భద్రతా నిబంధనలను ఈ ఏడాది కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. హీట్ స్ట్రెస్‌పై అవగాహన కల్పించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







