కువైట్‌లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!

- July 29, 2026 , by Maagulf
కువైట్‌లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!

కువైట్ సిటీ: ఫ్రీలాన్స్ బిజినెస్ కోసం కొత్త లైసెన్సుల జారీని కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుత నిబంధనలను సమీక్షించి, స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం కొత్త లైసెన్స్ దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే ఉన్న వన్-పర్సన్ కంపెనీ లైసెన్సులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్రీలాన్స్ వ్యాపారాలు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు.

లైసెన్సింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI)తో కలిసి పనిచేస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాపార నమోదు వివరాలను చిరునామా రికార్డులతో అనుసంధానం చేయడంతో పాటు, రెండు సంస్థల మధ్య డిజిటల్ సమన్వయాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నది. ప్రతిపాదిత సవరణలతో ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ విధానాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

ప్రస్తుతం ఈ విధానంలో 15కిపైగా రంగాలకు చెందిన 122 ఆర్థిక కార్యకలాపాలకు లైసెన్సులు జారీ చేస్తున్నారు. వీటిలో ప్రొఫెషనల్, సాంకేతిక, కన్సల్టెన్సీ సేవలు, ఐటీ, కమ్యూనికేషన్స్, రియల్ ఎస్టేట్, వాణిజ్యం, టూరిజం, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, డిజైన్, ఆర్ట్స్, స్పోర్ట్స్, వినోదం, పర్యావరణ సేవలు, వ్యవసాయం తదితర కార్యాలయం అవసరం లేని వ్యాపారాలు ఉన్నాయి.

మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 తొలి ఐదు నెలల్లో 6,586 వన్-పర్సన్ కంపెనీ లైసెన్సులు జారీ అయ్యాయి. జనవరిలో 1,085, ఫిబ్రవరిలో 1,557, మార్చిలో 1,144, ఏప్రిల్‌లో 1,512, మేలో 1,288 లైసెన్సులు మంజూరయ్యాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో కొత్త లైసెన్సుల జారీ 15 శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com