సిమ్ కార్డుల కొనుగోలుపై బహ్రెయిన్ పోలీసుల వార్నింగ్..!!
- July 30, 2026
మనామా: ఇతరుల కోసం తమ పేరుతో సిమ్ కార్డులు కొనవద్దని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Interior Ministry) ప్రజలను హెచ్చరించింది. అలాంటి సిమ్ కార్డులు నేర కార్యకలాపాలకు ఉపయోగిస్తే, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న "అల్ అమన్" అవగాహన కార్యక్రమంలో భాగంగా హిద్ద్ పోలీస్ స్టేషన్ హెడ్ కల్నల్ డాక్టర్ ఒసామా బహర్ ఈ సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ డిజిటల్ గుర్తింపును (Digital Identity) కాపాడుకోవాలని ఆయన సూచించారు.
మొబైల్ నంబర్లు బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ సేవలతో అనుసంధానమై ఉంటాయని, అందువల్ల మోసాలు, సైబర్ నేరాలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల దర్యాప్తులో అవి కీలక ఆధారాలుగా మారుతాయని వివరించారు. ఏదైనా నేరంలో ఉపయోగించిన మొబైల్ నంబర్ మీ పేరుతో నమోదై ఉంటే, దర్యాప్తులో భాగంగా ముందుగా విచారణకు పిలుస్తారని తెలిపారు. అసలు నేరస్థుడు ఎవరో గుర్తించే ముందు, నమోదిత యజమానిని అధికారులు విచారిస్తారని చెప్పారు.
తమ పేరుతో నమోదైన సిమ్ కార్డును ఇతరులు ఉపయోగించేందుకు ఇవ్వడం ద్వారా నేరస్థులకు రక్షణ కల్పించినట్టే అవుతుందని, అదే సమయంలో నమోదిత వ్యక్తి అనుమానాలకు గురవుతారని హెచ్చరించారు.
ప్రజలు తమ పేరుతో నమోదైన అన్ని మొబైల్ నంబర్లను ఒకసారి పరిశీలించి, ప్రస్తుతం ఉపయోగించని లేదా తమ నియంత్రణలో లేని సిమ్ కార్డులను వెంటనే టెలికాం సేవల సంస్థల ద్వారా రద్దు చేయించాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పేరుతో తీసుకున్న సిమ్ కార్డులను కుటుంబ సభ్యులే ఉపయోగిస్తున్నారో లేదో నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.
ఈ సందర్భంగా "మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. దేశాన్ని కూడా రక్షించండి" అంటూ కల్నల్ డాక్టర్ ఒసామా బహర్ పిలుపునిచ్చారు. సిమ్ కార్డుల నమోదును సక్రమంగా ధృవీకరించుకోవడం ద్వారా మోసాలు, సైబర్ నేరాలను నివారించడంలో పాటు వ్యక్తిగత ప్రతిష్ఠను కూడా కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







