ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!

- August 01, 2026 , by Maagulf
ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!

దోహా: ఖతార్‌లో సైబర్ భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు జాతీయ సైబర్ భద్రతా సంస్థ (NCSA) కీలక చర్యలు చేపట్టింది. సైబర్ భద్రతా విధానాల రూపకల్పన, డేటా రక్షణ ప్రమాణాల అమలుపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన నిపుణులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది.

NCSAలోని సైబర్ సెక్యూరిటీ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ విభాగం ఆధ్వర్యంలో 13వ పాలసీ మేనేజ్‌మెంట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సైబర్ భద్రతా విధానాల రూపకల్పన నుంచి అమలు, సమీక్ష వరకు అనుసరించాల్సిన విధానాలపై పాల్గొనేవారికి సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే సంస్థల లక్ష్యాలు, ప్రభుత్వ నిబంధనలు, మారుతున్న సైబర్ ముప్పులకు అనుగుణంగా విధానాలను రూపొందించే ఉత్తమ పద్ధతులను వివరించారు.

కొత్త సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు విధానాలను నిరంతరం సమీక్షించి, అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరాన్ని నిపుణులు వివరించారు. అదే సమయంలో జాతీయ డేటా క్లాసిఫికేషన్ పాలసీ మరియు జాతీయ సమాచార భద్రతా ప్రమాణాల అమలుపై 12వ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇందులో డేటా క్లాసిఫికేషన్ పాలసీ వెర్షన్ 3.0, ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్ స్టాండర్డ్ వెర్షన్ 2.1కు అనుగుణంగా సమాచారాన్ని రక్షించే విధానాలపై శిక్షణ అందించారు.

ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో సైబర్ భద్రతా ప్రమాణాల అమలును మరింత బలోపేతం చేయడంతో పాటు, పెరుగుతున్న సైబర్ ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని NCSA వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com