అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- August 03, 2026
అబుదాబి: అబుదాబిలో పెంపుడు కుక్కలు, పిల్లులను తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధనకు ఇచ్చిన గడువు ముగియడంతో ఇకపై నమోదు చేయని యజమానులపై జరిమానాలు విధించనున్నారు. 2025 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం వ్యక్తిగత యజమానులకు ఏడాది గడువు ఇవ్వగా, అది 2026 ఫిబ్రవరి 3తో ముగిసింది. దీంతో ఇప్పుడు నమోదు చేయని ప్రతి పెంపుడు జంతువుకు వెయ్యి దిర్హమ్‌ల జరిమానా విధించనున్నారు.
అబుదాబి మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం (DMT) ప్రకారం, ఎమిరేట్‌లోని అన్ని పెంపుడు కుక్కలు, పిల్లుల వివరాలతో సమగ్ర డేటాబేస్ రూపొందించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి జంతువు వివరాలను దాని యజమాని, మైక్రోచిప్, మెడికల్ రికార్డులతో అనుసంధానం చేయడం ద్వారా టీకాల నిర్వహణ, తప్పిపోయిన జంతువులను త్వరగా గుర్తించడం, వీధి జంతువుల సంఖ్యను తగ్గించడం వంటి చర్యలు మరింత సమర్థంగా అమలు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలు అబుదాబిలోని అన్ని పెంపుడు కుక్కలు, పిల్లులకు వర్తిస్తాయి. పెట్ షాపులు, జంతు ఆశ్రయ కేంద్రాలు, క్యాటరీలు వంటి సంస్థలకు ఆరు నెలల గడువు ఇచ్చారు. అలాగే యజమాని మారిన ప్రతి సందర్భంలోనూ కొత్త యజమాని వివరాలను వ్యవస్థలో తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
నమోదు ప్రక్రియ ఇలా..
పెంపుడు జంతువును సమీపంలోని లైసెన్స్ పొందిన వెటర్నరీ క్లినిక్‌కు తీసుకెళ్లాలి. అక్కడ మైక్రోచిప్‌ను ధృవీకరించడం లేదా అవసరమైతే కొత్త మైక్రోచిప్ అమర్చడం, ఆరోగ్య పరీక్ష నిర్వహించడం, టీకాలు పూర్తయ్యాయో లేదో పరిశీలించడం జరుగుతుంది. అనంతరం ఎమిరేట్స్ ఐడీ, యూఏఈ పాస్ ద్వారా TAMM వ్యవస్థలో వివరాలు నమోదు చేసి, యాజమాన్య ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. వ్యక్తిగత యజమానులకు ఈ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం. 12 వారాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెంపుడు జంతువులకు ముందుగా ప్రత్యేక ఫైల్ నంబర్ కేటాయిస్తారు. అవసరమైన వయస్సు పూర్తై, టీకాలు పూర్తి అయిన తర్వాత యాజమాన్య ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు
పెంపుడు జంతువును నమోదు చేయని యజమానులకు ఒక్కో జంతువుకు 1,000 దిర్హమ్‌ల జరిమానా విధిస్తారు. అలాగే జంతువులను వదిలివేయడం (Abandonment) చేస్తే 2,000 దిర్హమ్‌లు, నిర్లక్ష్యం చేయడం లేదా హింసించడం వంటి జంతు సంక్షేమ ఉల్లంఘనలకు 5,000 దిర్హమ్‌ల వరకు జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు. గడువు ముగియడంతో ప్రస్తుతం ఈ నిబంధనల అమలు పూర్తిస్థాయిలో ప్రారంభమైందని, ఇకపై ఎలాంటి అదనపు గడువు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే
- ఖతార్‌లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!
- కువైట్‌లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్‌లు..!!
- ఖరీఫ్ సీజన్‌కు దోఫార్‌లో కట్టుదిట్టమైన భద్రత..!!
- అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!
- జపాన్ యెన్‌తో పోలిస్తే అమెరికా డాలర్‌కు భారీ ఎదురుదెబ్బ..
- హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్‌లో డేటా లీక్ కలకలం..కేసు నమోదు







