కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్

- August 03, 2026 , by Maagulf
కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్

హైదరాబాద్: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతి చెందిన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ కుటుంబానికి తెలంగాణ పోలీస్ శాఖ అండగా నిలిచింది. కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి విలువైన బీమా చెక్కును తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చరణ్‌కుమార్ 2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా మల్కాజిగిరి కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తూ, డిప్యూటేషన్‌పై ఈగల్ ఫోర్స్‌లో సేవలందిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 22-23 తేదీల అర్ధరాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో చరణ్‌కుమార్‌కు కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా, కొంతకాలం చికిత్స అనంతరం 2025 అక్టోబర్ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే తిరిగి యశోద ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com