డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం
- August 03, 2026
మధుర గాయని ఆలపించిన అజరామరమైన గీతాలతో అంజలి ఘటించిన డల్లాస్ తెలుగు గాయనీ గాయకులు, సంగీతాభిమానులు.
ఫ్రిస్కో, టెక్సాస్: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఎస్. జానకి (జానకమ్మ) గారికి సంగీత నివాళిగా శనివారం డల్లాస్‌లోని తెలుగు కళాభిమానులు ఒక అద్భుతమైన సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.
DGIT (Dallas Got India Talent) వ్యవస్థాపకుడు రామన్ వీరంరాజు నాయకత్వంలో, కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం శుభమ్ ఈవెంట్ సెంటర్–A2B, ఫ్రిస్కోలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత పరిమళ మార్పాక జానకి సంగీత ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు, ప్రతి గీతానికి ఇచ్చిన చక్కని పరిచయాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.
డల్లాస్ మెట్రోప్లెక్స్‌లోని పలువురు ప్రతిభావంతులైన గాయనీ, గాయకులు జానకి ఆలపించిన అజరామరమైన గీతాలతో ఆమెకు సంగీతాంజలి ఘటించారు. ప్రేమ, భక్తి, శృంగారం, జానపదం, భావోద్వేగం వంటి విభిన్న భావాలను ప్రతిబింబించే ఆమె చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రతి గీతం ముగిసినప్పుడల్లా సభాభవనం కరతాళ ధ్వనులతో మార్మోగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ గాయనిగా శిష్ట్లా జానకి విశిష్ట లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే – భావ వ్యక్తీకరణ - పాటలోని ఆనందం, బాధ, ప్రేమ, భక్తి, కోపం, అమాయకత్వం ఇలా ఏ భావాన్నైనా ఆమె గాత్రంలో సహజంగా పలికించగల్గడం; గాత్ర వైవిధ్యం - హాస్యపాత్రల స్వరం, రెండేళ్ళ పసిపాప నుంచి, తొంబై ఏళ్ల వృద్ధురాలి వరకూ ఏ స్వరాన్నైనా అద్భుతంగా పలికించగల అరుదైన సామర్థ్యం; భాషలపై పట్టు - ఏ భాషలో పాట పాడినా, ఆ భాషకు చెందిన వ్యక్తే పాడుతున్నారేమో అనిపించేంత స్పష్టమైన ఉచ్చారణతో పాడడానికి నిరంతర సాధన; సంగీతదర్శకుల అభిరుచికి అనుగుణంగా - శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, భక్తిగీతాలు, వేగవంతమైన నృత్యగీతాలు ఇలా ఎలాంటి పాటనైనా సమాన ప్రతిభతో పాడే నైపుణ్యం; వినయం - ఎన్నో వేల పాటలు పాడి, అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నప్పటికీ, తాను నిత్య విద్యార్ధినేనంటూ ఎంతో నిరాడంబరంగా జీవించిన పుణ్యజీవి అన్నారు. 6 దశాబ్దాలపాటు 15 రకాల వివిధ భాషల్లో 50,000 కు పైగా పాటలగా సాగిన గాయనీమణి జానకి గారి గాత్ర జైత్రయాత్ర అజరామరం అంటూ ఘన నివాళులర్పించారు.”
డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఎస్. జానకి గారి గానం భారతీయ సంగీతానికి ఒక అపూర్వమైన వరమని, ఆమె పాటలు యుగయుగాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని కొనియాడారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు రామన్ వీరంరాజు మరియు అనంత్ మల్లవరపు మాట్లాడుతూ - విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా భారతీయ కళలను ప్రోత్సహించే మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.
అందమైన వేదిక అలంకరణ, అద్భుతమైన సంగీత బృందం, స్థానిక గాయనీ, గాయకుల ప్రతిభ, పరిమళ మార్పాక చక్కని వ్యాఖ్యానం, ప్రేరణాత్మక సందేశాలు, అలాగే బాల గణపవరపు అందించిన నాణ్యమైన ఆడియో సపోర్ట్ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి. కార్యక్రమం ముగింపులో ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో గానకోకిల ఎస్. జానకి గారికి తమ సంగీత ప్రణామాలర్పించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ విశాలమైన వేదికను అందించడమే కాకుండా, విచ్చేసిన అతిథులు మరియు ప్రేక్షకులకు ఆతిథ్యపూర్వకంగా రుచికరమైన అల్పాహారం అందించి కార్యక్రమ విజయానికి విశేషంగా సహకరించినందుకు A2B (Adyar Anand Bhavan) యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
DGIT (Dallas Got India Talent) మరియు కళావాహిని సంయుక్తంగా నిర్వహించిన ఈ సంగీత నివాళి కార్యక్రమం డల్లాస్ తెలుగు సాంస్కృతిక వేదికపై చిరస్మరణీయమైన సంగీత సంధ్యగా నిలిచి, జానకమ్మ ఆలపించిన అజరామరమైన గీతాల ద్వారా ఆమెకు ఘనమైన సంగీతాంజలి అర్పించిన ఒక విశిష్ట సాంస్కృతిక వేడుకగా చరిత్రలో నిలిచిపోనుంది.
తాజా వార్తలు
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం
- దుబాయ్‌కు భారత కొత్త కాన్సుల్ జనరల్‌గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం
- హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే
- ఖతార్‌లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!







