రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..

- August 03, 2026 , by Maagulf
రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..

దుబాయ్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులకు మానసిక ధైర్యాన్ని అందించేందుకు దుబాయ్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. "రిలీవింగ్ ది ఇంజర్డ్" (Relieving the Injured) కార్యక్రమంలో భాగంగా రషీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోడ్డు ప్రమాద బాధితులను పోలీసులు పరామర్శించారు.

అత్యవసర సేవలకే పరిమితం కాకుండా, ప్రమాద బాధితులకు మానసిక, నైతిక మద్దతు అందించడం ద్వారా సమాజానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.

ఈ బృందానికి ట్రాఫిక్ అవగాహన విభాగంలోని కమ్యూనిటీ అండ్ ట్రాఫిక్ యాక్టివిటీస్ సెక్షన్ అధిపతి లెఫ్టినెంట్ కల్నల్ అలీ యూసుఫ్ యాకూబ్ నాయకత్వం వహించారు. అధికారులు ఆస్పత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి బహుమతులు అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తద్వారా ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.

దుబాయ్ పోలీస్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం దుబాయ్ పోలీసుల మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. ప్రమాద బాధితులకు మానసిక, నైతిక మద్దతు అందించడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

బాధితులను ప్రత్యక్షంగా పరామర్శించడం ద్వారా వారికి ధైర్యం కలిగించడమే కాకుండా, వారి కుటుంబ సభ్యుల్లో కూడా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇది మంచి అవకాశంగా ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు.

మానవతా సేవలను, రోడ్డు భద్రతా సందేశాలను కలిపి ఇలాంటి సామాజిక కార్యక్రమాలను ట్రాఫిక్ విభాగం నిరంతరం నిర్వహిస్తోందని, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా దుబాయ్ రహదారులను మరింత సురక్షితంగా మార్చడమే తమ లక్ష్యమని బ్రిగేడియర్ బిన్ సువైదాన్ తెలిపారు.

ప్రమాద బాధితులు కూడా తమను పరామర్శించిన దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్శన తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, ప్రమాదం వల్ల కలిగిన మానసిక ఒత్తిడిని అధిగమించడంలో పోలీసుల ప్రోత్సాహం ఎంతో తోడ్పడిందని వారు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com