దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

- August 03, 2026 , by Maagulf
దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

దుబాయ్: దుబాయ్‌లోని ప్రముఖ షేక్ జాయెద్ రోడ్‌లో ఉన్న ఓ కార్ షోరూమ్‌లో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడంతో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారికంగా వెల్లడించింది.

పేలుడు జరిగిన వెంటనే సివిల్ డిఫెన్స్, అత్యవసర సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.

ఘటన జరిగిన గంటలోపే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకుని, ప్రమాద స్థలాన్ని సురక్షితంగా మార్చినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. బాధితుల జాతీయత వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. ఘటనకు గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికారిక వర్గాలు ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, ఇలాంటి ఘటనలపై అధికారిక వనరుల ద్వారా వచ్చే సమాచారాన్నే నమ్మాలని, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాయి. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.

గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి

యూఏఈలో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో, గ్యాస్ సిలిండర్లను సురక్షితంగా నిల్వ చేయడం, నిర్వహించడం, వినియోగించడం అత్యంత కీలకమని భద్రతా నిపుణులు మరోసారి సూచిస్తున్నారు. ముఖ్యంగా గృహాలు, రెస్టారెంట్ల నిర్వాహకులు వంటగ్యాస్ సిలిండర్ల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇటీవల దుబాయ్ పోలీసులు కూడా లైసెన్స్ లేని గ్యాస్ సిలిండర్ విక్రేతల నుంచి సిలిండర్లు కొనుగోలు చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని 300 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 2025లో 575, 2024లో 1,361 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రజలు కేవలం అధికారిక అనుమతి పొందిన కంపెనీలు, సరఫరాదారుల నుంచే గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ నింపడం లేదా నాసిరకం సిలిండర్ల వినియోగం ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com