2035 నాటికి 33 శాతం ఉద్గారాల తగ్గింపే లక్ష్యం..!!

- August 04, 2026 , by Maagulf
2035 నాటికి 33 శాతం ఉద్గారాల తగ్గింపే లక్ష్యం..!!

మస్కట్: 2035 నాటికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గరిష్ఠంగా 33 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒమాన్ ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల విభాగం (UNFCCC) కి ఒమాన్ పర్యావరణ అథారిటీ నివేదికను అధికారికంగా సమర్పించింది. ఈ నివేదిక ద్వారా పారిస్ ఒప్పందం అమలుపై తమ నిబద్ధతను ఒమాన్ మరోసారి స్పష్టం చేసింది. అలాగే 2035 వరకు దేశ వాతావరణ లక్ష్యాలు, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు చర్యలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా తీసుకోనున్న చర్యలను ఇందులో వివరించింది.

2024ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. ఆ ఏడాదిలో ఒమాన్ మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు సుమారు 93.6 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమానంగా (CO₂) నమోదయ్యాయి. 2035 నాటికి ఎలాంటి బాహ్య సహాయం లేకుండానే 7 శాతం ఉద్గారాలను తగ్గించాలని ఒమాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ ఆర్థిక సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక మద్దతు, సామర్థ్యాభివృద్ధి లభిస్తే మరో 26 శాతం అదనంగా తగ్గించనున్నట్లు పేర్కొంది. దీంతో మొత్తం ఉద్గారాల తగ్గింపు లక్ష్యం 33 శాతానికి చేరనుంది.

ఈ లక్ష్య సాధనలో భాగంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణ, ఇంధన సామర్థ్య పెంపు, తక్కువ కార్బన్ పరిశ్రమల అభివృద్ధి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, సర్క్యులర్ ఎకానమీ ప్రోత్సాహం, కార్బన్ క్యాప్చర్, వినియోగం, నిల్వ (CCUS) సాంకేతికతల అమలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపింది.

వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు నీటి వనరులు, వ్యవసాయం, మత్స్య రంగం, ప్రజారోగ్యం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక వంటి కీలక రంగాల్లో అనుసరణ చర్యలు చేపట్టనున్నట్లు నివేదికలో వెల్లడించింది.

ఈ నివేదిక ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ రంగం, నిపుణుల సంస్థల సమన్వయంతో రూపొందించబడిందని పర్యావరణ అథారిటీ తెలిపింది. హరిత ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆకర్షించడం, వాతావరణ నిధులను పొందడం, తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు దేశాన్ని మలచడం, అలాగే 2050 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నివేదిక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com