ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- August 04, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత విస్తరించడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సచివాలయంలో టీ-ఫైబర్ (T-Fiber) పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్ని వేగవంతం చేయడంలో టీ-ఫైబర్ పాత్ర అత్యంత కీలకమని, అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే నెట్‌వర్క్ పరిధిలోకి రావడం వల్ల పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ ఇంటర్నెట్‌కు స్వస్తి–టీ-స్వాన్ బదిలీ వేగవంతం:
ప్రభుత్వ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ శాఖలు ఉపయోగిస్తున్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రతీ ప్రభుత్వ ఆఫీసుకు కనెక్టివిటీ కల్పించడం ద్వారా డిజిటల్ పాలనను ఒకే వేదికపైకి తీసుకురావచ్చని వివరించారు.
ఇక ఇంటింటికీ ఇంటర్నెట్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు ప్రారంభ దశ నుంచే పూర్తి స్థాయి టీ-ఫైబర్ సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు “ఇంటింటికి ఇంటర్నెట్” కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- 18 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించిన యువ ప్రొఫెసర్ నాథన్ థామస్
- గుజరాత్లో విజృంభిస్తున్న చాందీపురా వైరస్
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..
- టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
- పోలీస్ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్
- ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- కాంగోలో ఎబోలా వైరస్ కలకలం..1,700 మంది మృతి
- ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి







