దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..
- August 04, 2026
దుబాయ్: దుబాయ్‌లోని అల్ ఖుజ్ ప్రాంతంలో ఉన్న ఓ కార్ షోరూమ్‌లో ఇటీవల జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తి భారతీయుడిగా గుర్తించినట్లు సమాచారం. అయితే మృతుడి గుర్తింపును అధికారికంగా ధృవీకరించేందుకు ఫోరెన్సిక్ విభాగం వేలిముద్రల నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ సామాజిక సేవకుడు మా గల్ఫ్ న్యూస్‌కు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, షోరూమ్ యాజమాన్యం మృతుడు 27 ఏళ్ల భారతీయుడు అని గుర్తించినప్పటికీ, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం మాత్రమే అధికారికంగా గుర్తింపును నిర్ధారించనున్నారు.
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ (CGI) కూడా మృతుడి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారికి అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.
భారతీయ మీడియా కథనాల ప్రకారం, మృతుడు కేరళకు చెందినవాడు. గత ఏడాది వివాహం చేసుకున్న ఆయన సుమారు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్‌కు వచ్చాడు. ప్రమాదం జరిగిన కార్ షోరూమ్‌లో మల్టీమీడియా మార్కెటింగ్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు సంస్థ వెబ్‌సైట్‌లో నమోదై ఉంది.
ఈ పేలుడు ఘటనలో మరో ఐదుగురు గాయపడినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది.
ఘటనాస్థలిలో కొనసాగుతున్న దర్యాప్తు
పేలుడు సంభవించిన షోరూమ్ పరిసరాల్లో ఇంకా కాలిన వాసన వెదజల్లుతోంది. లగ్జరీ కార్ల షోరూమ్ గోడలు పొగతో నల్లగా మారగా, సమీపంలోని దుకాణాల బోర్డులు కూడా పేలుడు ప్రభావంతో దెబ్బతిన్నాయి.
ఘటనాస్థలిలో అత్యవసర సేవల సిబ్బంది, దర్యాప్తు అధికారులు పరిశీలనలు కొనసాగిస్తున్నారు. షోరూమ్‌లో కార్లు ప్రదర్శనలో ఉన్నప్పటికీ ప్రస్తుతం దానిని మూసివేశారు.
సంస్థ స్పందన కోసం మీడియా ప్రతినిధులు సంప్రదించగా, ప్రస్తుతం బాధితులు, వారి కుటుంబాలకు సహాయం చేయడంపైనే యాజమాన్యం దృష్టి సారించిందని కస్టమర్ సర్వీస్ ప్రతినిధి తెలిపారు.
క్షణాల్లో చేరుకున్న సహాయక బృందాలు
పేలుడు సమయంలో సమీపంలోని దుకాణంలో ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, పెద్ద శబ్దం వినిపించగానే షోరూమ్ వైపు మంటలు కనిపించాయని చెప్పారు. భయంతో దగ్గరకు వెళ్లలేకపోయానని, అయితే కొద్ది నిమిషాల్లోనే అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయని వివరించారు.
మంటలను అదుపులోకి తీసుకున్న అనంతరం దర్యాప్తు అధికారులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి, పేలుడుకు గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ ఎలా వచ్చింది?
కార్ షోరూమ్‌లో గ్యాస్ సిలిండర్ ఎందుకు ఉండింది? పేలుడుకు అసలు కారణం ఏమిటి? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, యూఏఈలో వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను సురక్షితంగా నిల్వ చేయడం, వినియోగించడం, నిర్వహించడం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి సూచించారు.
అలాగే భద్రతా ప్రమాణాలు పాటించని, లైసెన్స్ లేని గ్యాస్ సిలిండర్ విక్రేతల వద్ద నుంచి సిలిండర్లు కొనుగోలు చేయవద్దని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని 300 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..
- టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
- పోలీస్ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్
- ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- కాంగోలో ఎబోలా వైరస్ కలకలం..1,700 మంది మృతి
- ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- 17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!
- ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం.. 9 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత కేరళ ప్రవాసికి రూ.1.36 లక్షల పరిహారం
- కువైట్‌లో బ్యాంక్ కార్డుల వినియోగం జోరు..!!







