యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!

- August 05, 2026 , by Maagulf
యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!

అబుదాబి:యూఏఈలో డొమెస్టిక్ వర్కర్స్ నియమించుకోవాలనుకునే వారికి మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (Mohre) కీలక సూచనలు చేసింది. లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా నియామకం, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ మధ్య ఉన్న ప్రధాన తేడాలను వెల్లడించింది.మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సాంప్రదాయ నియామక విధానంలో యజమానులు మొహ్రే అనుమతి పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ఇంటి పనివారిని నియమించుకుంటారు. ఈ ప్రక్రియలో యజమాని, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదురుతుంది. దీంతో యూఏఈ డొమెస్టిక్ వర్కర్స్ చట్టం ప్రకారం యజమానికి చట్టపరమైన రక్షణ, హామీలు లభిస్తాయి.

ఇక డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో యజమాని ఏజెన్సీ ప్రమేయం లేకుండా నేరుగా పనివారిని నియమించుకోవచ్చు. అయితే ఇందుకు మొహ్రే ఆమోదించిన అండర్‌టేకింగ్‌పై సంతకం చేసి, నియామకానికి సంబంధించిన పూర్తి బాధ్యతను యజమానే స్వీకరించాల్సి ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో డొమెస్టిక్ వర్కర్స్ చట్టంలోని హామీలు వర్తించవని, పనివారికి సంబంధించి ఎలాంటి గ్యారంటీలను యజమాని కోరలేరని మొహ్రే స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, 2026 తొలి ఆరు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై మొహ్రే విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 42 రిక్రూట్‌మెంట్ కార్యాలయాలపై మొత్తం 135 చట్టపరమైన, పరిపాలనా ఉల్లంఘనల కేసులు నమోదు చేసి జరిమానాలు విధించింది.

వాటిలో 106 కేసులు యజమానులకు చట్టం ప్రకారం తిరిగి చెల్లించాల్సిన రిక్రూట్‌మెంట్ ఫీజులను గడువులోగా తిరిగి ఇవ్వకపోవడానికే సంబంధించినవని మొహ్రే వెల్లడించింది. డొమెస్టిక్ వర్కర్‌ను ఏజెన్సీకి తిరిగి అప్పగించినా లేదా ఉద్యోగం మానేసినట్లు సమాచారం వచ్చినా, రెండు వారాల్లోపు రిక్రూట్‌మెంట్ ఫీజును తిరిగి చెల్లించడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com