యూఏఈలో ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ కాంట్రాక్ట్ నమోదు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!!

- August 07, 2026 , by Maagulf
యూఏఈలో ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ కాంట్రాక్ట్ నమోదు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!!

అబుదాబి: యూఏఈలో వివాహం చేసుకోదలిచిన కపుల్స్ ఇకపై న్యాయ మంత్రిత్వ శాఖ (Ministry of Justice) రూపొందించిన ఎలక్ట్రానిక్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ సిస్టమ్ ద్వారా వివాహ ఒప్పందం (Marriage Contract) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ సేవ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫెడరల్ షరియా కోర్టుల్లో అందుబాటులోకి వచ్చింది.

ఈ స్మార్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా దరఖాస్తు సమర్పించడం, వివాహాధికారితో (Marriage Officiant) అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించడం, ఆమోదం పొందిన వివాహ ఒప్పందం డిజిటల్ కాపీని ఈ-మెయిల్ ద్వారా స్వీకరించడం వంటి అన్ని సేవలను ఒకే వేదికపై పూర్తి చేయవచ్చు. అలాగే వివాహాధికారులు కూడా స్మార్ట్ పరికరాల ద్వారానే ప్రక్రియను పూర్తి చేయగలిగేలా వ్యవస్థను రూపొందించారు.

దరఖాస్తు విధానం

వివాహ ఒప్పందం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ దశలను అనుసరించాలి.

* న్యాయ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* Electronic Marriage Contracts Systemను ఎంచుకోవాలి.

* UAE Pass ద్వారా లాగిన్ కావాలి.

* వివాహ ఒప్పందం రకాన్ని ఎంపిక చేసుకోవాలి.

* వధూవరులు, సాక్షులు తదితర వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

* దరఖాస్తు సమర్పించి సేవా రుసుము చెల్లించాలి.

ఆ తర్వాత వివాహాధికారి దరఖాస్తును పరిశీలించి సంబంధిత వ్యక్తుల సంతకాలు తీసుకుంటారు. అనంతరం దరఖాస్తును సమీక్షించి న్యాయమూర్తి ఆమోదానికి పంపిస్తారు. ఆమోదం అనంతరం వివాహ ఒప్పందం డిజిటల్ కాపీని భార్యాభర్తలకు ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు.

అవసరమైన పత్రాలు

* ఎమిరేట్స్ ఐడీ

* వైద్య పరీక్ష నివేదిక

ముస్లింలకు:

* దరఖాస్తుదారుడి గుర్తింపు పత్రాలు

* ఇద్దరు సాక్షుల గుర్తింపు పత్రాలు

* అవసరమైన ఇతర ధ్రువపత్రాలు

ముస్లిమేతరులకు:

 ఇద్దరు జీవిత భాగస్వాముల గుర్తింపు పత్రాలు

* అవసరమైతే సంబంధిత రాయబార కార్యాలయం నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (NOC)

* వైద్య పరీక్ష ధ్రువపత్రం

* జన్యు పరీక్ష (Genetic Screening) ధ్రువపత్రం

ముస్లిమేతరుల సివిల్ మ్యారేజ్‌కు అర్హత

సివిల్ మ్యారేజ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ నిబంధనలను పాటించాలి.

* ఇద్దరి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి.

* వివాహం పురుషుడు-మహిళ మధ్య మాత్రమే జరగాలి.

* ఇద్దరికీ చట్టబద్ధంగా వివాహం చేసుకునే అర్హత ఉండాలి.

* ఇద్దరు సోదరీమణులను ఒకేసారి వివాహం చేసుకోవడం నిషేధం.

* వధువు ఇప్పటికే మరొక వివాహ బంధంలో ఉండకూడదు.

ఫీజు

వివాహ ఒప్పందం దరఖాస్తు సమర్పణకు 50 దిర్హమ్‌లు ఫెడరల్ సేవా రుసుముగా నిర్ణయించినట్లు యూఏఈ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ సమగ్ర డిజిటల్ వ్యవస్థ ద్వారా దరఖాస్తు నుంచి తుది ఆమోదం వరకు మొత్తం వివాహ ఒప్పంద ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com