యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

- August 08, 2026 , by Maagulf
యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

అక్టోబర్ 11న దుబాయ్ అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఈటీసీఏ ప్రతినిధులతో కేటీఆర్ చర్చ

హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈటీసీఏ–యూఏఈ) ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం నంది నగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈటీసీఏ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా యూఏఈలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతినిధులు కేటీఆర్‌కు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రతి ఏటా బతుకమ్మతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈసారి అక్టోబర్ 11, 2026న దుబాయ్‌లోని అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌ను కోరారు.

గల్ఫ్ కార్మికుల పరిస్థితులపై ఆరా

ఈ సందర్భంగా ఈటీసీఏ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ గల్ఫ్‌లోని తెలంగాణ కార్మికుల పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై ఆరా తీశారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల ప్రస్తుత పరిస్థితులు, వారి సంక్షేమానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణకు దూరంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈటీసీఏ ప్రతినిధులను కేటీఆర్ అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ప్రవాస తెలంగాణ సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఈటీసీఏ కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా గల్ఫ్ కార్మికుల కష్టనష్టాల్లోనూ అండగా నిలుస్తూ, ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు సహాయ సహకారాలు అందిస్తున్న తీరు గొప్పదని కేటీఆర్ అన్నారు. గల్ఫ్‌లో తెలంగాణ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ వంతు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకుపోయిన పలువురు తెలంగాణవాసుల సమస్యల పరిష్కారానికి కేటీఆర్ వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ చూపి, వారిని స్వస్థలాలకు చేరుకునేలా చేసిన విషయాన్ని ఈటీసీఏ ప్రతినిధులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ బిడ్డల సమస్యల పరిష్కారానికి కేటీఆర్ అందిస్తున్న సహకారానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈటీసీఏ ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 2026న దుబాయ్‌లోని అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. యూఏఈలోని తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈటీసీఏ ఏర్పాట్లు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com