సౌదీలో వారంలో 10,827 మంది అక్రమ వలసదారుల బహిష్కరణ..!!

- August 09, 2026 , by Maagulf
సౌదీలో వారంలో 10,827 మంది అక్రమ వలసదారుల బహిష్కరణ..!!

రియాద్: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై భద్రతా బలగాలు చేపట్టిన తనిఖీల్లో వారం రోజుల్లో 14,440 మంది అక్రమ నివాసితులు అరెస్టు అయ్యారు. జూలై 30 నుంచి ఆగస్టు 5 వరకు భద్రతా బలగాలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. అరెస్టయిన వారిలో 7,090 మంది రెసిడెన్సీ చట్టాన్ని, 3,932 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని, మరో 3,418 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 10,827 మంది అక్రమ నివాసితులను దేశం నుంచి బహిష్కరించారు. మరో 18,131 మందిని ప్రయాణ పత్రాలు పొందేందుకు వారి దేశాల దౌత్య కార్యాలయాలకు పంపించారు. 6,357 మంది బహిష్కరణ కోసం ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

సౌదీ సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించిన 1,593 మందిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వీరిలో 40 శాతం మంది యెమెన్‌కు చెందినవారు కాగా, 59 శాతం మంది ఇథియోపియా జాతీయులు. మిగిలిన ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. అలాగే సౌదీ నుంచి అక్రమంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 32 మందిని కూడా అరెస్టు చేశారు. అక్రమ నివాసితులకు రవాణా సౌకర్యం కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం లేదా ఉద్యోగాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడిన 25 మందిని కూడా అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు పూర్తి చేసేందుకు మొత్తం 32,012 మంది ప్రవాసులు సంబంధిత ప్రక్రియలో ఉన్నారు. వీరిలో 29,995 మంది పురుషులు, 2,017 మంది మహిళలు ఉన్నారు.

అక్రమంగా వ్యక్తులను సౌదీలోకి ప్రవేశించేందుకు సహకరించడం, దేశంలో రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం లేదా ఏదైనా సహాయం, సేవ అందించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష, గరిష్ఠంగా SR1 మిలియన్ జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. నిందితులు ఉపయోగించిన వాహనాలు, అక్రమ నివాసితులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఉపయోగించిన ఇళ్లను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.అక్రమ నివాసం, అక్రమ ప్రవేశం లేదా ఇతర సంబంధిత ఉల్లంఘనలపై ప్రజలు అధికారులకు సమాచారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. మక్కా, రియాద్, ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నంబర్‌కు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో 999 మరియు 996 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com