కొరియాలో యువతి మృతి..కే-పాప్ ఫ్యాన్‌ కమ్యూనిటీలో ఆన్‌లైన్ వేధింపులపై చర్చ..!!

- August 09, 2026 , by Maagulf
కొరియాలో యువతి మృతి..కే-పాప్ ఫ్యాన్‌ కమ్యూనిటీలో ఆన్‌లైన్ వేధింపులపై చర్చ..!!

షార్జా: కే-పాప్ అభిమానుల మధ్య ఆన్‌లైన్ వేధింపులు, విషపూరితమైన ఫ్యాన్ కల్చర్‌పై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. దక్షిణ కొరియాలో ఓ జపాన్ యువతి మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో యూఏఈలోని కే-పాప్ అభిమానులు ఆన్‌లైన్ వేధింపులను ఖండిస్తున్నారు. షార్జాలో నివసిస్తున్న 23 ఏళ్ల సిరియన్ ప్రవాసి తాలా నీమ్ తనకు ఎదురైన ఆన్‌లైన్ వేధింపులను గుర్తుచేసుకున్నారు. ఓ కాన్సర్టులో తాను ఓ కే-పాప్ కళాకారుడితో జరిగిన పరిచయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న తర్వాత కొందరు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తెలిపారు. ఆ కళాకారుడి దృష్టిని ఆకర్షించేందుకు తాను కొన్ని పనులు చేశానని, అవినీతిపూరిత మార్గంలో మీట్ అండ్ గ్రీట్ అవకాశం సంపాదించుకున్నానని కొందరు ఆరోపించినట్లు చెప్పారు. అయితే, అందరు అభిమానులు ఇలాగే ఉండరని ఆమె స్పష్టం చేశారు.

పెరుగుతున్న కే-పాప్ ఫ్యాన్‌ బేస్

ప్రపంచవ్యాప్తంగా కే-పాప్ అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రముఖ కే-పాప్ గ్రూపుల కచేరీలు అనేక దేశాల్లో పూర్తిగా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. 2019 నుంచి 2023 మధ్య కొరియా సంగీత పరిశ్రమలోని నాలుగు అతిపెద్ద ఏజెన్సీల కలిపిన ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి సుమారు 4 ట్రిలియన్ కొరియన్ వోన్‌కు చేరినట్లు 2024 మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. అయితే అభిమానుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ ఫ్యాన్ కమ్యూనిటీల్లో కొన్ని ప్రతికూల ధోరణులు కూడా కనిపిస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో కొందరు నకిలీ పేర్లు, యూజర్‌నేమ్‌ల వెనుక దాక్కొని తమకు నచ్చినట్లు మాట్లాడుతున్నారని తాలా పేర్కొన్నారు. తమ నిజమైన గుర్తింపు బయటపడదనే భావనతో కొందరు ఇతరులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. భారతీయ ప్రవాసి సయ్యదా నవాబ్ ఫాతిమా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో వ్యక్తులు తమ నిజ జీవితంలో చెప్పలేని విషయాలను కూడా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి ఉందన్నారు.

కొరియాలో జపాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి

ఆగస్టు 5న ఓ జపాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కొరియాలోని సియోల్‌లోని తన నివాసంలో మృతి చెందినట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కొన్ని ఆన్‌లైన్ నివేదికలు ఆమెను ‘మినా చాన్’గా పేర్కొంటూ, ఆమె కే-పాప్ గ్రూప్ ENHYPEN అభిమాని అని పేర్కొన్నాయి. అయితే యోన్‌హాప్ అసలు నివేదికలో ఆమె పేరును లేదా కే-పాప్ గ్రూప్ పేరును వెల్లడించలేదు. ENHYPEN సభ్యుడు Ni-Ki గ్రూప్ కార్యక్రమాల్లో కొందరు తమపై దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించిన తర్వాత ఆమెపై ఆన్‌లైన్‌లో వేధింపులు పెరిగినట్లు సమాచారం. కొంతమంది అభిమానులు మాత్రం ఆ వ్యాఖ్యలు ‘మినా చాన్’ను ఉద్దేశించి చేసినవేనని భావించారు. ఆమె గతంలో అమెరికాలో జరిగిన ఫ్యాన్‌సైన్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇందుకు కారణమైంది.
ఆ తర్వాత ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో క్షమాపణలు కోరుతూ పోస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆమె పరిస్థితిపై లైవ్‌స్ట్రీమ్ సమయంలో వచ్చిన సమాచారంతో అధికారులు స్పందించగా, అనంతరం ఆమె మృతి చెందినట్లు నిర్ధారించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ ఘటనపై సియోల్‌లోని యోంగ్సాన్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు  చేస్తోంది.

‘అభిమానం అంటే వేధించడం కాదు’

ఈ ఘటన తర్వాత పలువురు కే-పాప్ అభిమానులు ఆన్‌లైన్ వేధింపులను తీవ్రంగా ఖండించారు. యూఏఈలో పదేళ్లకు పైగా కే-పాప్ అభిమానిగా ఉన్న రూత్ డిసౌజా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కళాకారుడిని ప్రేమించడం, అభిమానించడం అంటే ఇతరులను వేధించే హక్కు కాదని ఆమె అన్నారు. ఆన్‌లైన్‌లో చేసే ప్రతి మాటకు విలువ ఉంటుందని, కళాకారులను, తోటి అభిమానులను కూడా మనుషులుగా చూడాలని సూచించారు. “ప్రజలు తప్పులు చేస్తారు. క్షమాపణలు చెబుతారు. ఆ తర్వాత జీవితం కొనసాగాలి” అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

షార్జాలో నివసిస్తున్న మరో 24 ఏళ్ల కే-పాప్ అభిమాని పీఎం మాట్లాడుతూ, చాలా సందర్భాల్లో కళాకారులు స్వయంగా బుల్లీయింగ్‌ను ప్రోత్సహించరని, కానీ కొందరు అభిమానులు తమకు నచ్చిన కళాకారుడిని రక్షించాలనే ఉద్దేశంతో ఇతరులపై దాడికి దిగుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితులకు అభిమానులు తమకు నచ్చిన కళాకారులతో ఏర్పరచుకునే ప్యారాసోషల్ అటాచ్‌మెంట్ కూడా ఒక కారణమని ఆమె పేర్కొన్నారు. అంటే కళాకారుడితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా, అతనితో లేదా ఆమెతో తనకు ప్రత్యేకమైన వ్యక్తిగత బంధం ఉందనే భావన కలగడం వంటిదని పేర్కొన్నది.

లైవ్‌స్ట్రీమ్స్, ఫ్యాన్ కాల్స్, సోషల్ మీడియా వంటి వాటి ద్వారా అభిమానులకు కళాకారులతో నిరంతరం వ్యక్తిగత సంబంధం ఉన్నట్లుగా అనిపించే వాతావరణం ఏర్పడుతోందని అభిమానులు చెబుతున్నారు. ఇది అభిమానుల్లో అనుబంధాన్ని పెంచినా, కొన్నిసార్లు హద్దులను చెరిపేసి అవాస్తవ అంచనాలకు దారితీస్తుందని నిపుణులు, అభిమానులు పేర్కొంటున్నారు.

‘అభిమానం ఆనందాన్ని ఇవ్వాలి’

అయితే కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీలోని ప్రతికూల ఘటనలే మొత్తం అభిమాన ప్రపంచాన్ని ప్రతిబింబవించవని పలువురు స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో సభ్యులు ఉన్న ‘బాంగ్టాన్ యూఏఈ’ అనే BTS ఫ్యాన్ క్లబ్ అడ్మిన్ యాన్ హినోలన్ మాట్లాడుతూ.. “అభిమానిగా ఉండటం ఆనందంగా ఉండాలి” అని అన్నారు. తమ కమ్యూనిటీలో ఆన్‌లైన్ వేధింపులను పెద్దగా ఎదుర్కోలేదని, అభిమానులు పరస్పరం మద్దతు ఇస్తూ BTS విజయాలను కలిసి జరుపుకుంటున్నారని ఆమె తెలిపారు. ఆన్‌లైన్ ఫ్యాన్ కమ్యూనిటీలు తప్పనిసరిగా విషపూరితంగా ఉండాల్సిన అవసరం లేదని, అవి పరస్పరం కలుసుకునే, ఆనందాన్ని పంచుకునే, తమకు చెందినవారమనే భావన కలిగించే వేదికలుగా ఉండవచ్చని చెప్పారు. పరస్పరం ఒకే ఆసక్తిని పంచుకునే వ్యక్తులు ఆనందంగా కలిసే వేదికలుగా అవి ఉండాలని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com