ఖతార్‌లో నియంత్రిత మందులు తీసుకెళ్లే ప్రయాణికులకు కొత్త ఈ-పర్మిట్ విధానం
- August 09, 2026
దోహా: ఖతార్‌కు వచ్చే లేదా ఖతార్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు వ్యక్తిగత వినియోగం కోసం నియంత్రిత మందులను తీసుకెళ్లేందుకు ముందస్తు అనుమతి పొందేలా ఆ దేశ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) కొత్త ఎలక్ట్రానిక్ పర్మిట్ వ్యవస్థను ప్రారంభించింది.
ఈ కొత్త ఆన్లైన్ విధానం ద్వారా ప్రయాణికులు ఇంటి నుంచే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు, తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. అనుమతి మంజూరైన తర్వాత పర్మిట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో పొందే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
నియంత్రిత మందుల వినియోగానికి సంబంధించిన ప్రక్రియలను సులభతరం చేయడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ఔషధాలపై పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడం ఈ కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఐదు రోజుల ముందుగానే దరఖాస్తు
అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత దరఖాస్తులను మూడు పని దినాల్లో ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రయాణంలో ఎలాంటి జాప్యం తలెత్తకుండా ఉండేందుకు ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి కనీసం ఐదు పని దినాల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పర్మిట్ పొందేందుకు వినియోగదారులు ఖతార్ నేషనల్ ఆథెంటికేషన్ సిస్టమ్ ద్వారా లాగిన్ కావాలి. అనంతరం ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసి, చెల్లుబాటు అయ్యే వైద్య ప్రిస్క్రిప్షన్‌తో పాటు అవసరమైన ఇతర పత్రాలను అప్లోడ్ చేయాలి.
దరఖాస్తులను ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగం పరిశీలించిన అనంతరం, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పర్మిట్లు జారీ చేస్తారు. నియంత్రిత మందుల జాబితా, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక యూజర్ గైడ్‌ను కూడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ చేపడుతున్న డిజిటల్ మార్పుల్లో భాగంగా ఈ కొత్త సేవను ప్రారంభించారు. జాతీయ ఆరోగ్య వ్యూహానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ-పర్మిట్ సేవ ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు నియంత్రిత మందుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎలక్ట్రానిక్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







