4వ బెటాలియన్‌ను సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- August 09, 2026
వరంగల్: జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్‌లోని మామునూర్ 4వ బెటాలియన్‌ను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సందర్శించారు. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 1990ల ప్రారంభంలో ఇదే ప్రాంతంలో ఏఎస్పీ ట్రైనీగా తన పోలీస్ కెరీర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం వరంగల్ రూరల్ ఏఎస్పీగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంతం నక్సల్స్‌కు బలమైన స్థావరంగా ఉండేదని గుర్తుచేశారు. అప్పటి రోజులు ఎన్నో సవాళ్లతో కూడుకున్నవని పేర్కొన్నారు.
బెటాలియన్‌కు చేరుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌కు ఏడీజీ (TGSP) సంజయ్ కుమార్ జైన్, వరంగల్ సీపీ శ్వేత, కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
రాష్ట్రంలోని అతిపెద్ద బెటాలియన్లలో ఒకటైన మామునూర్ 4వ బెటాలియన్ నక్సలిజం నిర్మూలనలో కీలక పాత్ర పోషించిందని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం కూడా ప్రధాన పోలీస్ ఆపరేషన్లు, భారీ బందోబస్తులు, విస్తృత స్థాయిలో బలగాల మోహరింపు, విపత్తుల సమయంలో సహాయక, రక్షణ చర్యల్లో బెటాలియన్ సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా డీజీపీ బెటాలియన్ క్యాంపస్‌ను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, సిబ్బంది క్వార్టర్స్, బలగాల మోహరింపు, విపత్తుల సమయంలో వినియోగించే రక్షణ పరికరాలను పరిశీలించారు.
అనంతరం బెటాలియన్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విధుల కేటాయింపులు, బదిలీల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీస్ విధుల నిర్వహణలో వేగవంతమైన మొబిలైజేషన్‌తో పాటు అవసరమైన ప్రాంతాల్లో బలగాలను త్వరితగతిన మోహరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
బదిలీలు, పదోన్నతులు, గృహ వసతి, విధులకు సంబంధించిన ఇతర సమస్యలను సిబ్బంది డీజీపీ దృష్టికి తీసుకురాగా, నిబంధనల ప్రకారం వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
పోలీస్ సిబ్బంది మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. తమ కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యసనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో పోలీస్ సిబ్బంది చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం వరంగల్ సీపీ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారుల కోసం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి సమావేశాలు అధికారుల మధ్య పరస్పర సమన్వయాన్ని పెంపొందించడంతో పాటు టీమ్ స్పిరిట్‌ను మరింత బలోపేతం చేస్తాయని డీజీపీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్‌లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!







