భారత చేనేత వారసత్వానికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’

- August 09, 2026 , by Maagulf
భారత చేనేత వారసత్వానికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’

న్యూఢిల్లీ: భారతదేశ చేనేత సంప్రదాయం, కళాకారులు, నేత కార్మికులు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’ను న్యూఢిల్లీలోని రఫీ మార్గ్‌లో ఉన్న కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఘనంగా నిర్వహించారు.ఆదిలీలా ఫౌండేషన్, హైదరాబాద్‌కు చెందిన బనానాజ్ యార్న్ అండ్ ఫ్యాబ్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి భారత ప్రభుత్వ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ వేణుగోపాల్ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పీ. నరహరి (IAS) ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వస్త్ర మంత్రిత్వ శాఖ మాజీ సీఈఓ రాజీవ్ జైన్, మాజీ డైరెక్టర్ డాక్టర్ సురేంద్ర కుమార్, మాజీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, ఆదిలీలా ఫౌండేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఆదినారాయణ, డాక్టర్ వేంకట రెడ్డి, బనానాజ్ యార్న్ అండ్ ఫ్యాబ్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సీ.భార్గవి తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ రాజా తాలూక్దార్, డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ సిన్హా, సంజయ్ భాయ్ (BWS), డాక్టర్ వీ.కే. ప్రసాద్,శశికళ కౌశిక్ తదితరులు హాజరయ్యారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు, కళాకారులు, వస్త్ర సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలు, సంస్థలు ఈ జాతీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. భారతీయ చేనేత రంగం పరిరక్షణ, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, నాణ్యత పెంపు, ఉపాధి కల్పనకు విశేష కృషి చేసిన పలువురిని ఈ సందర్భంగా సత్కరించారు.

భారత చేనేత పరిశ్రమ కేవలం వస్త్రాల తయారీ రంగం మాత్రమే కాదని, దేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయ జ్ఞానం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. కోట్లాది గ్రామీణ కుటుంబాలకు చేనేత రంగం జీవనాధారంగా ఉందని తెలిపారు. మారుతున్న ప్రపంచ మార్కెట్ పరిస్థితుల్లో పర్యావరణహిత ఉత్పత్తి విధానాలు, నాణ్యత, ప్రత్యేకమైన సాంస్కృతిక వైవిధ్యం కారణంగా భారతీయ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు.

అరటి పీచుతో వస్త్రాల తయారీ పై ప్రత్యేక ఆకర్షణ

కార్యక్రమంలో డాక్టర్ వేంకట రెడ్డి అభివృద్ధి చేసిన అరటి పీచుతో తయారు చేసిన వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరటి చెట్ల నుంచి లభించే ఫైబర్‌పై తాను చేపట్టిన అధ్యయనం, పరిశోధనల గురించి ఆయన వివరించారు. అరటి పీచును వస్త్ర పరిశ్రమలో వినియోగించడం ద్వారా భవిష్యత్తులో కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా పెంచవచ్చని వివరించారు.

సమ్మేళనంలో సుస్థిర అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, మహిళలు–యువతకు నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఉపాధి కల్పన, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించారు.

‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వోకల్ ఫర్ లోకల్’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘లోకల్ టు గ్లోబల్’ వంటి జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు చేనేత రంగం కీలకమని వక్తలు పేర్కొన్నారు. సంప్రదాయ చేనేత కళను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయడం ద్వారా ఈ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

వందేమాతరం, దీప ప్రజ్వలన, గణేశ వందనతో కార్యక్రమం ప్రారంభమై, జాతీయ గీతంతో ముగిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధులు, చేనేత–వస్త్ర సంఘాల ప్రతినిధులు, ఎగుమతిదారులు, విద్యావేత్తలు, పరిశోధకులు, మీడియా ప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ సమ్మేళనం భారత చేనేత వారసత్వ పరిరక్షణతో పాటు ఆధునిక సాంకేతికత, సుస్థిర అభివృద్ధి, ఉపాధి కల్పన దిశగా చేనేత రంగానికి కొత్త అవకాశాలను పరిచయం చేసే వేదికగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com