‘రిపోర్ట్ మీ’ ఫిర్యాదుల వివరాలు గోప్యమే.. పీఏఎం హామీ..!!

- August 10, 2026 , by Maagulf
‘రిపోర్ట్ మీ’ ఫిర్యాదుల వివరాలు గోప్యమే.. పీఏఎం హామీ..!!

కువైట్: కార్మిక చట్టాల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే పౌరులు, నివాసితుల వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతామని కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) స్పష్టం చేసింది. ‘రిపోర్ట్ మీ’ సేవ ద్వారా అందించే సమాచారం, వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టబోమని తెలిపింది. కార్మిక, మానవతా ఉల్లంఘనలను ఎలాంటి భయాందోళనలు లేకుండా అధికారుల దృష్టికి తీసుకురావాలని పౌరులు, నివాసితులను PAM కోరింది.

సాహెల్ అప్లికేషన్‌లోని ‘రిపోర్ట్ మీ’ సేవ ద్వారా వినియోగదారులు ఉల్లంఘనకు సంబంధించిన విభాగాన్ని ఎంచుకుని, పూర్తి వివరాలను నమోదు చేయడంతో పాటు అవసరమైతే ఫొటోలను కూడా జత చేయవచ్చు. దీంతో ఫిర్యాదులను వేగంగా పరిశీలించి, సంబంధిత ప్రాంతాల్లో పర్యవేక్షణ, తదుపరి చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని PAM తెలిపింది. అందిన ఫిర్యాదులను ప్రత్యేక బృందాలు గోప్యంగా పరిశీలించి, వాస్తవాలను ధ్రువీకరించిన అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటాయని పేర్కొంది.

ఎలాంటి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయొచ్చు?

‘రిపోర్ట్ మీ’ సేవ ద్వారా పలు రకాల కార్మిక చట్టాల ఉల్లంఘనలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. వీటిలో.. దేశీయ కార్మికుల నియామక కార్యాలయాలకు సంబంధించిన ఉల్లంఘనలు, సరైన పత్రాలు లేకుండా పనిచేస్తున్న కార్మికులు, సంస్థలు, నిషేధిత సమయాల్లో కార్మికులతో పనులు చేయించడం, ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్మికులను పనిలో నియమించడం వంటి ఉల్లంఘనలను ఫిర్యాదు చేయవచ్చని PAM తెలిపింది.

ఫిర్యాదు చేసే వారి గుర్తింపు, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో కార్మిక చట్టాల ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ప్రజల సహకారం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com