ఒమన్‌లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు

- August 10, 2026 , by Maagulf
ఒమన్‌లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు

మస్కట్: ఒమన్‌లో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి గరిగంటి శ్రీహరి (45) మృతదేహాన్ని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి (TGWWC) చొరవతో స్వదేశానికి తరలించారు. చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో అధికారులు, భారత రాయబార కార్యాలయం, కంపెనీ స్పాన్సర్ సహకరించడంతో మృతదేహాన్ని స్వల్ప వ్యవధిలో భారత్‌కు పంపించినట్లు TGWWC ప్రతినిధులు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన శ్రీహరి గత 10 సంవత్సరాలుగా ఒమన్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. అయితే కంపెనీ జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన అత్యవసర సెలవుపై స్వదేశానికి వచ్చారు.

సెలవు ముగిసిన అనంతరం సుమారు మూడు నెలలకు తిరిగి మస్కట్ వెళ్లిన శ్రీహరి, గతంలో పనిచేసిన కంపెనీకి సమాచారం ఇవ్వకుండా మరో సంస్థలో పనిచేయడం ప్రారంభించారు. ఒమన్‌లో స్పాన్సర్‌కు తెలియకుండా మరో కంపెనీలో పనిచేయడాన్ని స్థానికంగా ‘కళ్లివెళ్లి’గా పిలుస్తారని, ఇది కార్మిక నిబంధనలకు విరుద్ధమని TGWWC ప్రతినిధులు తెలిపారు.

గుండెపోటుతో మృతి

ఈ క్రమంలో జూలై 29, 2026న శ్రీహరి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తోటి కార్మికులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

శ్రీహరి మరో కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యంలో మృతదేహాన్ని స్వదేశానికి తరలించే విషయంలో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ప్రభుత్వ అధికారులు, గతంలో పనిచేసిన కంపెనీ స్పాన్సర్ తొలుత మృతదేహం తరలింపు బాధ్యత తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

TGWWC చొరవతో సమస్య పరిష్కారం

ఈ విషయాన్ని శ్రీహరి కుటుంబ సభ్యులు TGWWC మస్కట్ కోఆర్డినేటర్ గోగు దేవరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే TGWWC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్కు సమాచారం అందించారు.

ఇద్దరూ కలిసి భారత రాయబార కార్యాలయం, సంబంధిత ఒమన్ అధికారులు, శ్రీహరి గతంలో పనిచేసిన కంపెనీ స్పాన్సర్‌తో సంప్రదింపులు జరిపారు. చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో శ్రీహరి మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు సహకరించాలని స్పాన్సర్‌ను కోరారు.

వారి విజ్ఞప్తికి స్పందించిన సంబంధిత అధికారులు అవసరమైన పత్రాల ఏర్పాటులో సహకరించడంతో మృతదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి తరలించేందుకు మార్గం సుగమమైందని TGWWC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్ తెలిపారు.

హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి ఉచిత అంబులెన్స్

మృతదేహం భారత్‌కు చేరుకున్న అనంతరం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీహరి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు TGWWC ప్రతినిధులు తెలిపారు.

తెలంగాణ సచివాలయంలోని NRI విభాగంతో సంప్రదించి ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు.

సహకరించిన వారికి కృతజ్ఞతలు

ఈ సందర్భంగా పాలాజీ శ్రీనివాస్, గోగు దేవరాజు మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలకు అండగా నిలవడమే TGWWC ప్రధాన లక్ష్యమని తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రతి కుటుంబానికి సాధ్యమైనంత సహాయం అందించేందుకు సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.

మృతదేహం స్వదేశానికి తరలించేందుకు సహకరించిన భారత కాన్సులేట్ మస్కట్, కంపెనీ స్పాన్సర్, ROP మెడికల్ డిపార్ట్‌మెంట్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామానికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, చట్టపరమైన ఇబ్బందులను అధిగమించి మృతదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేసిన TGWWC మస్కట్ కోఆర్డినేటర్ గోగు దేవరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్, ఒమన్ శాఖ అధ్యక్షులు జావుడల సత్తన్నకు శ్రీహరి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, TGWWC సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com