నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!

- August 12, 2026 , by Maagulf
నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!

దోహా: నాన్‌-హైడ్రోకార్బన్ రంగాల్లో బలమైన వృద్ధి సాధించడం ద్వారా ఖతార్ ఆర్థిక వ్యవస్థ 2025లో స్థిరత్వాన్ని ప్రదర్శించింది. దేశ ఆర్థిక వ్యవస్థ గత ఏడాది 2.9 శాతం వృద్ధి చెందగా.. నాన్‌-హైడ్రోకార్బన్ రంగాలు ఏకంగా 4.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మేరకు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) తన వార్షిక స్థూల ఆర్థిక సమీక్షలో వెల్లడించింది. ఖతార్ నేషనల్ విజన్ 2030లో భాగంగా చేపట్టిన ఆర్థిక వైవిధ్యీకరణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని QCB తెలిపింది.

2025లో ఖతార్‌లో సగటు ద్రవ్యోల్బణం కేవలం 0.5 శాతంగా నమోదైంది. కొన్ని వినియోగ వస్తువుల ధరల్లో, ముఖ్యంగా ఆభరణాల విభాగంలో మాత్రమే స్వల్ప ధరల ఒత్తిడి కనిపించిందని QCB తెలిపింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా స్థిరంగా కొనసాగింది. ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు లేకపోవడంతోపాటు.. మార్కెట్‌లో అధిక వేడి లేదా ఊహాజనిత పెట్టుబడుల ప్రభావం కనిపించలేదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.

ఖతార్ దేశీయ ప్రైవేట్ రంగం తన వృద్ధి పథాన్ని కొనసాగించింది. 2025లో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) సగటు 51.2 పాయింట్లుగా నమోదైంది. 50 పాయింట్లకు పైగా PMI నమోదవడం ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయనడానికి సంకేతంగా QCB పేర్కొంది.

5.1 మిలియన్ల మంది పర్యాటకులు

ఖతార్ పర్యాటక రంగం కూడా 2025లో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. దేశాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య 5.1 మిలియన్లకు చేరింది. 2024లో 4.9 మిలియన్లు, 2023లో 4 మిలియన్ల మంది ఖతార్‌ను సందర్శించారు.

అంతర్జాతీయ ఆర్థిక రంగంలోనూ ఖతార్ బలమైన స్థితిని కొనసాగించింది. 2025లో దేశ కరెంట్ అకౌంట్ మిగులు QR116.2 బిలియన్లకు చేరింది. ఇది దేశ జీడీపీలో 14.8 శాతం కావడం విశేషం.

ఖతార్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ ఏడాదిలో 1.8 శాతం పెరిగింది. స్థానిక మూలధన మార్కెట్లను మరింత బలోపేతం చేసేందుకు సస్టైనబుల్, షరియా అనుగుణ ఆర్థిక సాధనాలను ప్రవేశపెట్టారు. ఖతార్‌లో తొలిసారిగా ESG ఆధారిత బాండ్, కార్పొరేట్ ఇస్లామిక్ సుకుక్‌ను కూడా జాబితా చేశారు.

బలమైన క్రెడిట్ రేటింగ్‌లు

ఖతార్ ఆర్థిక బలాన్ని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా గుర్తించాయి. S&P, Fitch సంస్థలు ఖతార్‌కు AA రేటింగ్‌ను, Moody’s Aa2 రేటింగ్‌ను కొనసాగించాయి. మూడు సంస్థలూ స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగించడం దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని QCB తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com